అన్నదాతను ఊరిస్తున్న ఆక్వా!

1 Aug, 2014 00:57 IST|Sakshi
అన్నదాతను ఊరిస్తున్న ఆక్వా!
  • రొయ్యల చెరువులుగా మారుతున్న పంటపొలాలు
  • పాయకరావుపేట : ఆక్వాసాగు రైతులను ఊరిస్తోంది. రొయ్యల పెంపకం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతాలకే పరిమితమైన ఇది వనామి రొయ్య రాకతో భారీగా విస్తరించింది. ఈ రొయ్యల పెంపకం లాభసాటిగా ఉండటం, ఎలాంటి వాతావరణమైనా అనువుగా ఉండటంతో పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

    పొలాలలను రొయ్యల పెంపకానికి చెరువులుగా మార్చివేస్తున్నారు. దీంతో భూముల లీజులు అమాంతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉన్న లీజు రూ. 30 వేల నుంచి రూ.70 వేల వరకూ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. రెండేళ్ల పాటు ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం ఇలా లీజు రూపంలో వచ్చేస్తుండటంతో పలువురు భూయజమానులు తమ పొలాలు లీజుకిస్తున్నారు.

    గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాయకరావుపేట మండలంలోని సాల్మన్‌పేట, రాజయ్యపేట, వెంకటనగరం, పెంటకోట, రాజవరం, కుమారపురం ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. చెరువులు ఏర్పాటుకు సంబంధించి భారీగా వ్యయమవుతున్నా రైతులు వెనుకాడట్లేదు. సాధారణంగా రొయ్యలను మార్చి, ఏప్రిల్ నెలలో సాగు చేస్తారు.

    ఈ వేసవిలో చెరువుల తవ్వకం ఆలస్యమవడంతో ప్రస్తుతం సాగు మమ్మరంగా చేపట్టారు. మరోవైపు మార్కెట్‌లో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆక్వాసాగు ఊపందుకుంది. ప్రభుత్వ పోత్సాహం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా