భయామీ

21 Nov, 2013 01:10 IST|Sakshi

=వెనామీ రైతుకు కష్టకాలం
 =దేశంలో ప్రవేశించిన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్
 =ఆక్వా రైతుల ఆందోళన
 =రూ. 2,025 కోట్ల నష్టం

 
ఆక్వా రైతుకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ (ఈఎంఎస్) వ్యాధి మన దేశంలోని వెనామీ రొయ్యలకూ వ్యాపించింది. దీనివల్ల ఇప్పటికే 30 శాతం రొయ్యలు చనిపోయి ఆక్వా రంగానికి జరగరాని నష్టం జరిగిపోయింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు మథనపడుతున్నారు.
 
కైకలూరు, న్యూస్‌లైన్ : వెనామీ రొయ్యలకు నివారణ లేని ఈఎంఎస్ వ్యాధి సోకడంతో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం తదితర దేశాల్లో   పంట విరామం ప్రకటించారు. ఈ క్రమంలో మన దేశంలో వెనామీ సాగుకు డిమాండ్ పెరిగింది. 2011-12 సంవత్సరాల్లో 91 వేల మెట్రిక్ టన్నుల వెనామీ ఉత్పత్తులు సాధించగా,  2012-13లో లక్షా 50 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది.

అందులో సింహభాగం కోస్తా ప్రాంతాలైన నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతిఅవుతున్నాయి. తెల్లచేపలు, పంగాసియాస్ చేపలు సాగు చేసే రైతులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అధిక విస్తీర్ణంలో ఈ సాగు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇటీవల కాలంలో రొయ్య మరణాలు ఎక్కువయ్యాయి. యాజమాన్య లోపాలు, తెల్లమచ్చ, విబ్రియో వంటి వ్యాధులతో టైగర్, వెనామీ రొయ్యలు చనిపోతున్నాయని రైతులు భావించారు. అనుమానం వచ్చి ఎంపెడా అధికారులు వ్యాధి సోకిన రొయ్యలను చెన్నైలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (ఆర్‌జీసీఏ)కు శాంపిల్స్ పంపారు. అక్కడినుంచి పరీక్షల నిమిత్తం అమెరికాలోని అరిజోన యూనివర్సిటీ ప్రొఫెసర్ లైట్‌నర్‌కు పంపించారు. ఆయన వాటిని పరీక్షించి ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ సోకిందని నిర్ధారించి నివేదిక ఇచ్చారు.  
 
 30 శాతం మరణించాయి..
 
 కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, నాగాయలంక, కృత్తివెన్ను మండలాలు, ఉభయగోదావరి జిల్లాల్లో ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, నర్సాపురం, మొగ ల్తూరు, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, కాట్రేనికోన, గుంటూరు జిల్లా రేపల్లె, నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈఎంఎస్ వ్యాధి సోకి 30 శాతం రొయ్యలు చనిపోయాయి. ఏడాదికి రూ. 6,700 కోట్ల ఆదాయానికి గాను ఇటీవలి కాలంలో రూ. 2,025 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
 తొలిగా చైనాలో గుర్తింపు
 
 ఈఎంఎస్ వ్యాధిని మొదటిసారి 2009లో  చైనాలోని టైగర్, వెనామీ చెరువుల్లో గుర్తించారు. పిల్ల వేసిన 30 నుంచి 40 రోజుల్లో మొత్తం మరణించాయి. సోకిన వ్యాధి ఏమిటో అర్థం కాక ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ (చిన్న వయసులోనే చనిపోయే వ్యాధి)గా పేరు పెట్టారు. దీనిని సాంకేతికంగా ‘ఎక్యూట్ హెపటో పాంక్రియాటిక్ డిసీజ్’ అంటారు. 2011లో వియత్నాం, మలేసియా, 2012లో థాయ్‌లాండ్, 2013లో భారత్‌లోనూ ఈ వ్యాధి విస్తరించింది.
 
 ఇది  స్వయంకృపరాధమే.. ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి పరోక్షంగా మనమే కారణమయ్యాం. వ్యాధి సోకిన వెనామీ బ్రూడు స్టాకును ఇతర దేశాల నుంచి దిగుమతి చేయవద్దని చెప్పినా కొందరు గుర్తింపులేని హేచరీలు వ్యాధిగ్రస్తమైన తల్లి రొయ్యలను దిగుమతి చేసుకున్నాయి. మన చెరువుల్లో పెంచిన తల్లిరొయ్యల నుంచి పిల్లలను పుట్టించి విక్రయించడం వల్ల ఇది మరింత వ్యాప్తి చెందింది.  నీటిని శుద్ధి చేయకుండా కాల్వల ద్వారా చెరువుల్లో నింపుతున్నారు. ఇది కూడా వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది. ఎంపెడా సూచించిన హేచరీల్లో మాత్రమే వెనామీ సీడు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 వ్యాధి లక్షణాలు..
 = రొయ్యలు పాలిపోయి తెల్లగా మారిన కాలేయం, క్లోమంతో ఉంటాయి.
 = ఆహారనాళం అక్కడక్కడ లేదా పూర్తిగా ఖాళీగా ఉంటుంది.
 = కాలేయంలో నల్లటి గీతలు కనిపిస్తాయి.
 = పిల్ల వేసిన పది రోజుల నుంచి మరణాలు సంభవిస్తాయి.
 = కాలేయం కుచించుకుపోయి ఉంటుంది.
 =వ్యాధిగ్రస్త రొయ్యలు చెరువులో మునిగిపోతాయి.
 = చూపుడు వేలితో కాలేయాన్ని నొక్కినప్పుడు గట్టిగా  ఉంటుంది.
 
 ఇలా చేయండి..
 =ఈఎంఎస్ వ్యాధికి నివారణ లేదు. ముందస్తు చర్యలు తీసుకుంటే మంచిదని కైకలూరులోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఆక్వా లేబొరేటరీ) పి.సురేష్ పలు సూచనలు చేశారు.
 =చెరువుల్లో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి.
 = చనిపోయిన రొయ్యలను ఏరివేసి గుంతలో పూడ్చి సున్నం, బ్లీచింగ్ చల్లాలి.
 = పట్టుబడి పట్టిన తర్వాత రెండు వారాలపాటు  చెరువును ఎండగట్టాలి.
 = చెరువు అడుగుభాగాన మట్టిని బ్లేడుతో తొలగించి దూరంగా పడవేయాలి.
 = నీటిని 300 ఎంఎం సైజు మెష్‌తో వడకట్టుకోవాలి.
 =ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వదలాలి.
 = రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచి 10-15 రోజుల తర్వాత ఆ నీటని చెరువుల్లో నింపుకోవాలి.
 = నిషేధించిన రసాయనాలు, ఎరువులను వాడరాదు.
 = వ్యాధిగ్రస్తమైన నీటిని శుద్ధి చేసి బయటకు వదలాలి.
 =నీటి, మట్టి పరీక్షలు చేయించి, మత్స్యశాఖ అధికారుల సూచనలు పాటించాలి.
 

మరిన్ని వార్తలు