కదంతొక్కిన ఆక్వా రైతులు

16 Sep, 2018 08:16 IST|Sakshi

ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై ధర్నా

ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిక

కైకలూరు: ఆక్వారంగ అభివృద్ధిలో ప్రభుత్వం చూపిస్తున్న అంకెల గారడీకి వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సింహద్రి రమేష్‌బాబు అన్నారు. ఆక్వా రైతుల విద్యుత్‌ చార్జీల చెల్లింపు విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా కైకలూరు తాలూకా సెంటర్‌లో శనివారం ఎస్సార్‌ సీసీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 96 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. మొదటి, ద్వితీయ స్థానాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఆక్వాసాగుకు  300 రోజులు నీరు అవసరమని చెప్పారు. అటువంటిది కేవలం 90 రోజులు నీరు మాత్రమే వస్తుందన్నారు.  గత ఏడాది ఆక్వా రైతులకు రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు విభాగం ప్రధాన కార్యదర్శి సింహద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ పోలవరంలో మూడు తరాల వాక్‌ అంటూ సీఎం హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ కొల్లేరు సరస్సు, ఆక్వా రైతులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే న్యాయం జరుగుతుందన్నారు. 

సమన్వయకర్త డీఎన్నార్‌ మాట్లాడతూ స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ కాషాయ పార్టీనా, పసుపు పార్టీనా తెలియడం లేదన్నారు. ఆయన చెబుతున్న అక్వా అభివృద్ధిపై కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పార్టీ నాయకులు బొడ్డు నోబుల్, పోసిన పాపారావుగౌడ్‌లు మాట్లాడుతూ ఆక్వా విద్యుత్‌ రాయితీని నేరుగా రైతులు చెల్లించుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర పార్టీ నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, వాసిపల్లి యోనాలు మాట్లాడుతూ ఆక్వా చెరువులకు తీవ్ర నీటి కొరత ఏర్పడిందన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రాజశేఖర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నంబూరి శ్రీదేవి, రాష్ట్ర మైనార్టీ నాయకులు మహ్మద్‌ జహీర్, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు