అడకత్తెరలో ఆక్వా రైతులు

28 Mar, 2020 05:07 IST|Sakshi

ఆక్వా ఫీడ్‌ రవాణాకు అడుగడుగునా ఆటంకాలు

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పల్లెల్లోకి రానివ్వని యువకులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. లాక్‌డౌన్‌.. ఆక్వా ఫీడ్‌ సరఫరా, రవాణాకు తీవ్ర ఆటంకంగా నిలిచింది. ఆక్వా ఫీడ్, మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల రవాణా, పంపిణీ లేక చేపలు, రొయ్యల చెరువుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రవాణాకు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్‌ వైరస్‌ భయంతో యువకులు తమ ఊళ్లలోకి లారీలను అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 

- గ్రామాల్లో గుండా వాహనాలను అనుమతించకపోవడంతో రొయ్యలు పట్టేందుకు, వాటి తలలు తీసేందుకు  కూలీలు కరవయ్యారు. ఫలితంగా రొయ్యల కంపెనీల యజమానులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఆక్వా పంట అంతా చెరువుల్లోనే ఉండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 
- గతంలో రొయ్యలు తీసుకువెళ్లేందుకు ప్రాసెసింగ్‌ యూనిట్లు, రొయ్యల కంపెనీల యజమానులు లారీలను పంపేవారు. ఇప్పుడు సరకును తమ కంపెనీల వద్దకే తెమ్మంటున్నారు. అయితే.. గ్రామాల్లోని ప్రజలు, పోలీసులు ఇందుకు 
అంగీకరించడం లేదు. 
- తయారీకి అవసరమైన ముడిపదార్థాలు, మైదా, సోయా, చేప మాంసం, విటమిన్లు వేర్వేరు ప్రాంతాల నుంచి రావాల్సి ఉండడంతో లారీలు రాక మేత తయారీ ఆగిపోయింది. దీంతో చేపలు, రొయ్యలు మేత కోసం అల్లాడుతున్నాయి. రొయ్యల కౌంట్, చేపల బరువు తగ్గిపోతున్నాయి. 
- హేచరీలు ఉత్పత్తి చేసిన రొయ్య పిల్లలను బయటకు పోనివ్వకపోవడంతో యజమానులు వాటిని సముద్రం పాల్జేస్తున్నారు. 
రైతులు కోరుతున్నదేమిటంటే.. 
- సీఎం చొరవ చూపి గ్రామ వలంటీర్ల ద్వారా చేపలు, రొయ్యల రవాణా, మేతల పంపిణీకి చర్యలు చేపట్టాలి. 
- మేతలు, ముడి పదార్థాలు, కూలీలు, ట్రాలీలను ఊళ్లలోని రహదారుల గుండా చేపల చెరువుల వద్దకు వచ్చేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. 

ఆక్వా సంఘాల రైతులతో నేడు సీఎం సమావేశం 
మంత్రి మోపిదేవి వెంకట రమణారావు 
ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. వైరస్‌ ఇతర ఇబ్బందులు లేకపోతే తమ పంటను రైతులు హార్వెస్ట్‌ చేయొద్దని సూచించారు. ఆక్వా రైతు సంఘాల నాయకులతో శనివారం సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమవుతారని, వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.

పతనమవుతున్న వనామీ ధర!  
- రాష్ట్రంలో దాదాపు ఏటా 80 లక్షల హెక్టార్లలో వనామీ సాగు జరుగుతోంది.  
- నాలుగు నెలల కాల వ్యవధిలో ఈ పంటను సాగు చేయడానికి రైతులు ఎకరానికి రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేస్తారు.  
- అన్నీ సవ్యంగా ఉంటే రైతులు ఎకరాకు ఆరేడు లక్షల రూపాయల వరకు లాభాన్ని పొందుతారు.  
- అదే వనామీ నేడు రైతులకు రెండు లక్షలకుపైగా నష్టాన్ని కలిగిస్తోంది. ‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ మాదిరిగా వనామీ రేటు పతనానికి కోవిడ్‌ వైరస్, రొయ్యలకు సంక్రమిస్తోన్న వైట్‌స్పాట్‌ వ్యాధి, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల మూసివేత, ఎగుమతులు లేకపోవడం వంటివి కారణమవుతున్నాయి. 
- కార్మికుల కొరత, ఎగుమతులు లేకపోవడంతో ప్రాసెసింగ్‌ ప్లాంట్లను నిర్వాహకులు మూసివేశారు.  
- దీంతో రొయ్యలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వైట్‌స్పాట్, ఇతర వైరస్‌లు సోకిన రొయ్యల్ని అమ్ముకోవడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలకు 100 కౌంట్‌ రొయ్యను రూ.100లోపే అమ్మేస్తున్నారు.  

మరిన్ని వార్తలు