ఏఆర్‌ కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య

2 Dec, 2018 08:41 IST|Sakshi
విలపిస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు. (అంతరచిత్రం) శిరీష (ఫైల్‌)

భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు 

కృష్ణలంక (విజయవాడ తూర్పు) : ఏఆర్‌ కానిస్టేబుల్‌ భార్య అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన లబ్బీపేటలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌లోని బీ బ్లాక్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కూరేటిపాలెంకు చెందిన కూరేటి సీతారామయ్య దంపతులకు శిరీష (23) తో పాటు ఆర్మీలో పని చేస్తున్న వినోద్, డిగ్రీ మూడవ సంవత్సరం చదువుకుంటున్న పవన్‌ కుమార్‌ సంతానం. ఒక్కతే కూతురు కావటంతో ప్రేమగా చూసుకునేవారు. 

ఈ క్రమంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన కోల్లు రవికుమార్‌కు ఇచ్చి గత జూన్‌ నెలలో వివాహం జరిపించారు. రవికుమార్‌ నగరంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ క్వార్టర్స్‌లో తల్లిదండ్రులతో పాటు జీవిస్తున్నాడు. అయితే, పెళ్ళి అయినప్పటి నుంచి తనతో అయిష్టంగా ఉంటూ ఎప్పుడూ దురుసుగా వ్యవహరిస్తూ సరిగా చూసుకునేవాడు కాదంటూ శిరీష తన తల్లిదండ్రుల వద్ద చెప్పుకుని బాధపడుతుండేది. ఇటీవల తరచూ భార్యతో గొడవ పడుతూ పుట్టింటి వాళ్లను అడిగి డబ్బులు తీసుకురావాలంటూ వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఆర్మీలో పని చేసే ఆమె పెద్ద తమ్ముడు వినోద్‌ ఇంటికి వస్తే, ఇప్పుడే వస్తానని చెప్పి రవికుమార్‌ బయటకు వెళ్ళిపోయాడు. 

ఆ సమయంలో భర్త తనను ఏ విధంగా వేధిస్తున్నాడో తమ్ముడికి చెప్పుకుని శిరీష బాధ పడింది. అతను రాత్రికి వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారగానే తన అక్క ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించిందని ఫోన్‌ రావటంతో ఒక్కసారిగా    తల్లడిల్లిపోయారు. హుటాహుటిన వచ్చి ఆమె మృతదేహం చూసి భోరున విలపించారు. విషయం తెలియడంతో ఏడీసీపీ జవాబ్‌జాన్, వెస్ట్‌ జోన్‌ ఏసీపీ సుధాకర్, సీఐ చంద్రశేఖరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. దీనిపై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు.. 
పెళ్లయిన నాలుగు నెలల నుంచి తన బిడ్డను చిత్రహింసలకు గురిచేసి శారీరకంగాను, మానసికంగా వేధిస్తున్నాడని, అతనే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రవికుమార్‌ తల్లిదండ్రులు విశాఖపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నారు. 

మేల్కొని చూసేసరికి..
అయితే శుక్రవారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి భోజనాల అనంతరం నిద్రించామని, ఉదయం 5 గంటలకు డ్యూటీ సిబ్బంది ఫోన్‌ చెయ్యగా మేలుకుని ఫోన్‌ మాట్లాడానని ఆ సమయంలో తన భార్య పక్కనే నిద్రపోతూ ఉందని రవికుమార్‌ చెబుతున్నాడు. తర్వాత పడుకుని ఉదయం మేల్కొని చూస్తే ఇంట్లో హాల్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించిందని పోలీసులకు తెలిపాడు.  

మరిన్ని వార్తలు