దూసుకొచ్చిన మృత్యువు

18 Feb, 2019 09:19 IST|Sakshi
మృతదేహాన్ని అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యం ,అప్పలనాయుడు (ఫైల్‌)

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన         లారీ

అరబిందో కార్మికుడు దుర్మరణం

శ్రీకాకుళం, రణస్థలం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో అరబిందో పరిశ్రమ కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబం ధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెల్ల గ్రామానికి చెందిన దుర్గాశి అప్పలనాయుడు(45) పైడి భీమవరంలోని అరబిందో పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో తాను పండించిన కూరగాయలను ద్విచక్ర వాహనంపై ఊరూరా అమ్ముతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కూరగాయలు పట్టుకుని రణస్థలం వైపు వస్తుండగా యునైటేడ్‌ బ్రూవరీస్‌ పరిశ్రమ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది.

ఈ ఘటనలో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న జె.ఆర్‌.పురం ఎస్‌ఐ బి.అశోక్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పలనాయుడుకు భార్య అప్పలరాములు, ముగ్గురు కుమార్తెలు ఉమ, ప్రియాంక, పవిత్ర ఉన్నారు. వీరిలో ఇద్దరికి వివాహాలు జరిగాయి. అప్పలనాయుడు మృతితో కనిమెల్లలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు