ఒప్పించారు ఒక్కటయ్యారు

16 Oct, 2019 12:46 IST|Sakshi
కాబోయే భర్తశివప్రసాద్‌తో ఎంపీ మాధవి

చిన్ననాటి స్నేహితుడితో ఎంపీ మాధవి వివాహం

రేపు శరభన్నపాలెంలో..

ప్రేమించుకోవడానికి రెండు హృదయాలు ఒకటి కావాలి. వివాహం చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. మొదట ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరువాత వారి అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పారు. ముందు కాదూ కూడదు అన్నా చివరకు వివాహానికి రెండు వైపుల వారు అంగీకరించారు. దీంతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి , గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ల మధ్య చిగురించిన ప్రేమ ఇప్పుడు వివాహంతో ఇద్దరిని ఒకటిగా చేస్తోంది.

కొయ్యూరు (పాడేరు): స్నేహ బంధం..ప్రేమగా అంకురించింది. మిత్రత్వం చిగురించి అది ప్రేమగా మారింది. ఎంపీ మాధవి, కాబోయే భర్త శివప్రసాద్‌ దాదాపు 16 సంవత్సరాల పాటు స్నేహితులుగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో మాధవికి సహాయం చేసేందుకు ఆమె వెనకే శివప్రసాద్‌ ఉన్నారు. అంత వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. పెద్దలు రెండు వైపుల కాస్తా వ్యతిరేకించారు. తరువాత వివాహానికి అంగీకరించారు.

ఇద్దరి తండ్రుల మధ్య పరిచయం
మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడు. శివప్రసాద్‌ తండ్రి నారాయణమూర్తి  మధ్య పరిచయం ఉంది. దేముడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న దేముడు, నారాయణమూర్తిల మధ్య మిత్రత్వం చాలాకాలం కొనసాగింది.

ఇద్దరూ సహధ్యాయులు
శివప్రసాద్‌ మాధవి క్లాస్‌మేట్లు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. నవోదయలో చదివిన మాధవి పదిలో బయటకు వచ్చారు. తరువాత ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఉన్నత విద్యలోను కలిసి చదువుకోవటంతో స్నేహం చిగురించింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు.

ఎన్నికలే స్నేహాన్ని ప్రేమగా మార్చాయి
ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలు ఇద్దరు స్నేహితులను ప్రేమికులుగా మార్చాయి. మాధవికి ఇద్దరు సోదరులున్నారు. అయితే ఎన్నికల సమయంలో కీలకంగా ఉండి సలహాలు ఇచ్చేవారు ఉండాలి. ప్రసాద్‌ ఎన్నికల సమయంలో అన్ని తానే వెనక నుంచి మద్దతు చెప్పారు. ఆ సమయంలో స్నేహితులు ఇద్దరు ప్రేమికులుగా మారారు. చివరకు ఎన్నికల త రువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 17న రాత్రి 3.15 నిమిషాలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుంది. 18న శరభన్నపాలెంలోనే విందు ఏర్పాటు చేశారు.

ఒకరినొకరంఅర్థం చేసుకున్నాం
ఇద్దరికి 16 ఏళ్లుగా  పరిచయం ఉంది. చిన్నతనం నుంచి స్నేహితులుగానే ఉండిపోయాం. కలిసి చదవడం మూలంగా ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. అన్ని తానై ఎన్నికల సమయంలో నన్ను నడిపించారు.అటువంటి వ్యక్తి భర్తగా రావడం నా సుకృతం.  –మాధవి, ఎంపీ

స్నేహమే ప్రేమగా మారింది
మొదటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులం కలిసి చదువుకున్నాం. ఎన్నికల సమయంలో ఇద్దరం కలిసి ప్రచారం చేశాం. అవసరమైన సాయం చేశాను. ఆ సమయంలోనే ఇద్దరి నడుమ స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. ఆమె నా భార్యగా రావడం నా అదృష్టం.– కుసిరెడ్డి శివప్రసాద్‌

మరిన్ని వార్తలు