అరకు ఉత్సవ్‌ అదుర్స్‌

2 Mar, 2020 04:14 IST|Sakshi
అరకు ఉత్సవ్‌లో విద్యార్థినుల జానపద నృత్యప్రదర్శన

ముగింపు రోజు పోటెత్తిన జనం.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

అరకులోయ: పర్యాటక ప్రాంతం అరకులోయలో ప్రభుత్వం గిరిజన ఆచారాలను గౌరవిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన, అరకు ఉత్సవ్‌– 2020 సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉత్సవ్‌ చివరిరోజైన ఆదివారం ఉత్సవాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా తరలిరావడంతో సాయంత్రం ఐదు గంటలకే ఎన్టీఆర్‌ మైదానం కిటకిటలాడింది. రికార్డు స్థాయిలో ప్రజలు తరలిరావడంతో ఉత్సవ్‌ ప్రాంగణం హోరెత్తింది. స్థానికంగా ఉన్న గిరిజన విద్యాలయాల్లోని గిరిజన విద్యార్థినులంతా పోటాపోటీగా గిరిజన సంప్రదాయలను ప్రతిబింబించే నృత్యాలు చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. ఇక గిరిజన సంప్రదాయ కొమ్ము, సవార, థింసా నృత్యాలు ప్రజలను మైమరిపించాయి.

తెలుగు రాష్ట్రాల్లో తన పాటలతో ప్రసిద్ధిచెందిన గాయకురాలు మంగ్లీ ముగింపు ఉత్సవానికి రావడంతో అరకు ఉత్సవ్‌ వేదిక మరింత సందడిగా మారింది. ఆమె తనదైన శైలిలో  పాటలు పాడి ప్రజలను హుషారెత్తించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలను కూడా పర్యాటకులు, స్థానికులు రుచిచూసి అద్భుతమని కితాబునిచ్చారు. ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కూడా పర్యాటకులు ఆసక్తిగా తిలకించడం కనిపించింది. అలాగే ఉత్సవ్‌ను పురష్కరించుకుని అధికార యంత్రాంగం జిల్లా క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, విలువిద్య, పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. విజేతైన క్రీడాకారులకు అరకు ఎంపీ గోడ్డెటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నగదు బహుమతులు, మెమొంటోలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు