శ్రీవారి ఆభరణాల మాయం నిజమే: చెన్నారెడ్డి

22 May, 2018 13:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పై జరుగుతున్న పరిణామాలపై తాజాగా పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్‌ పెద్దారపు చెన్నారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన అనేక వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. వెంకన్న స్వామిని కృష్ణ దేవరాయులు ఏడు సార్లు దర్శించుకున్నారన్నారు.

ఆసమయంలో ఆయన ఇచ్చిన అభరణాలను చాలావరకు కరిగించారని, పలు వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పదిశాతం కూడా లేవని తెలిపారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన అభరణాలపై 2012 లో ఓ కమిటి వేశామని, సదరు కమిటీ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు.

మరోవైపు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఈవో మాట్లాడుతూ...టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారమే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చట్టప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఈవో తెలిపారు. స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు