డబ్బులు ఇవ్వకుంటే ఆమరణ దీక్షే : జ్యోతి సురేఖ

7 May, 2018 11:16 IST|Sakshi

డబ్బులు ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తానన్న సురేఖ

ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్‌ మధ్యవర్తిత్వం

నిర్ణయం మార్చుకున్న జ్యోతి సురేఖ

సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఇస్తామన్న కోటి రూపాయలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు సమాచారం. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ నిరాహార దీక్షకు దిగనుందనే సమాచారం అందుకున్న టీడీపీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, సాఫ్‌ చైర్మన్‌ అంకయ్య చౌదరిలు జ్యోతి సురేఖతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్‌ సాయంత్రంలోగా జ్యోతి సురేఖ డబ్బులు ఇచ్చేవిధంగా జీవో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకూ దీక్ష ఆలోచనను విరమించుకోవాలని కోరారు. దీంతో సురేఖ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడాకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించని చెరుకూరి సత్యనారాయణకు తనకు కేటాయించిన నజరానాలో 15లక్షల రూపాయలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

15లక్షలు ఇవ్వడం కుదరదు : సురేఖ తండ్రి
జ్యోతి సురేఖకు అర్జున్‌ అవార్డు వచ్చినప్పుడు ప్రభుత్వం కోటి రూపాయలు నజరాన ప్రకటించిందని.. కానీ ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వలేదని సురేఖ తం‍డ్రి సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాప్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే డబ్బు రావడంలో ఆలస్యమైందని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2012లోనే జ్యోతి సురేఖ చెరుకూరి సత్యనారాయణ వద్ద శిక్షణ తీసుకోవడం మానేసిందని, కానీ అవార్డు వచ్చింది 2017 అని గుర్తుచేశారు. కోచ్‌కు 15లక్షల రూపాయలు ఇవ్వడం కుదరదన్నారు. సాయంత్రంలోపు డబ్బులు ఇవ్వకపోతే సురేఖ దీక్ష చేస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు