భూసేకరణ ఆర్డినెన్సుపై పోరాటం

25 Jan, 2015 02:55 IST|Sakshi
భూసేకరణ ఆర్డినెన్సుపై పోరాటం
  • అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీపీసీసీ డిమాండ్
  • సాక్షి, హైదరాబాద్: రైతుల పొట్టకొట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై శనివారం గాంధీభవన్‌లో పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ ప్రజల అవసరాల ముసుగులో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, ఇది పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్సులో పేద రైతులకు నష్టం కలిగించే, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న అంశాలను సమావేశంలో వివరించారు. 2013 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని అంశాలను కూడా ఈ సందర్భంగా కొప్పుల రాజు వివరించారు.
     
    23న దేశవ్యాప్త ఉద్యమం: పొన్నాల

    తెలంగాణ పేదలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, మల్లు రవి, శ్యాంమోహన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. దొంగచాటుగా తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతారన్నారు. పరిశ్రమ అవసరాలకు తీసుకున్న భూమిలో, పరిశ్రమ పెట్టకుండా పడావు పెట్టినా అసలు రైతులకు ఈ ఆర్డినెన్సు ద్వారా ఆ భూమి దక్కకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

    రాజకీయాలకతీతంగా ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించాలని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ఫిబ్రవరి 23న ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త పోరాటం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పొన్నాల తెలిపారు. కాగా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు చేయకుండా, వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానానికి నిరసనగా అన్ని పార్టీలను, సంఘాలను కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నాల ఒక కమిటీని ప్రకటించారు. మల్లు రవి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కొనగాల మహేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు.

మరిన్ని వార్తలు