ఫ్లెక్సీలపై వేటు

29 Jan, 2015 01:52 IST|Sakshi
ఫ్లెక్సీలపై వేటు

కమిషనర్ ఆదేశాలతో కదిలిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది
మూడు రోజుల్లో అనుమతి లేని బ్యానర్లన్నీ తొలగించాలని నిర్ణయం
అనధికారికంగా ఏర్పాటుచేస్తే చర్యలు
నగర సుందరీకరణ కోసం స్పెషల్ డ్రైవ్

 
విజయవాడ సెంట్రల్ : పండుగలు, పుట్టిన రోజు శుభాకాంక్షలు, అభిమాన నాయకులకు స్వాగతం పలుకుతూ ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలతో నగరంలో ప్రధానరోడ్లు, కూడళ్లలో నిండిపోయాయి. హైకోర్టు ఆదేశాలు, నగర సుందరీకరణ నేపథ్యంలో వీటిని తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ ఆదేశాలు జారీచేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మూడు రోజుల్లో నగరంలోని అనధికారిక బ్యానర్లను తొలగించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం బందరు రోడ్డులోని బ్యానర్లను తొలగించారు.
 
ఇష్టారాజ్యంగా ఏర్పాటు


నగరంలో రోడ్లపై బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఏర్పాటుచేయాలి. శుభాకాంక్షలు తెలిజేస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను రెండు రోజుల్లో తొలగించాలి. సంబంధిత వ్యక్తులు తొలగించకపోతే టౌన్‌ప్లానింగ్ అధికారులే తొలగించడంతోపాటు ఇందుకు అయిన ఖర్చులను బాధ్యుల నుంచి వసూలుచేయాలి. గడిచిన రెండేళ్లలో ఫ్లెక్సీల సంస్కృతి నగరంలో బాగా పెరిగింది. ఏ చిన్న కార్యక్రమం అయినా చోటా, మోటా లీడర్లు సైతం ఫ్లెక్సీలను ఏర్పాటుచేస్తున్నారు. నెలల తరబడి వీటిని తొలగించకుండా వ్యక్తిగత ప్రచారం పొందుతున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోకపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వీధులు, ప్రధాన రోడ్లు అనే తేడా లేకుండా నగరం ఫ్లెక్సీలమయమైంది.

స్పెషల్ డ్రైవ్‌కు బీజం పడిందిలా...

రెండు రోజులుగా నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ డివిజన్ల పర్యటన చేపట్టారు. వీధులన్నీ కలియతిరుగుతున్నారు. ఎక్కడ చూసినా బ్యానర్లు కనిపించడంపై అసహనం వ్యక్తంచేశారు. వీటి ఏర్పాటుకు అనుమతి ఇచ్చారా.. అని టౌన్‌ప్లానింగ్ అధికారులను ప్రశ్నించగా, లేదనే సమాధానం ఎదురైంది. అనధికారికంగా ఏర్పాటుచేసిన బ్యానర్లన్నింటినీ తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. నిబంధలకు విరుద్ధంగా మరోసారి బ్యానర్లు ఏర్పాటుచేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

సుందరీకరణపై దృష్టి

నగరం రాజధానికి కేంద్రంగా మారిన నేపథ్యంలో సుందరీకరణపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల క్రితమే నగరపాలకసంస్థ అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్, అప్పటి కమిషనర్ హరికిరణ్ ఏలూరు, బందరు, రైవస్ కాల్వల్లో పర్యటించారు. సుందరీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఏర్పాటుచే సిన ఫ్లెక్సీలపై అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. స్మార్ట్‌సిటీ (ఆకర్షణీయ నగరంగా) అభివృద్ధి చేయాల్సిందిగా అధికారులకు సూచించినట్లు తెలిసింది. దీంతో నగర సుందరీకరణకు విఘాతం కల్గిస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని కమిషనర్ నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు