కృష్ణాజలాలు లేకుంటే సీమ ఎడారే: నారాయణ

24 Nov, 2013 23:28 IST|Sakshi

మదనపల్లె: కృష్ణాజలాలను అదనంగా తీసుకురాకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాల పార్టీ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో హంద్రీ-నీవా ప్రాజెక్టు సాధనకై రైతు సదస్సును నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ కృష్ణామిగులు జలాలను రాయలసీమ ప్రాంతానికి తీసుకురావడంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో చేపట్టిన హంద్రీ-నీవా, గాలేరు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయని తెలపారు.

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాయలసీమకు 40 టీఎంసీల కృష్ణాజలాలు ఇస్తున్నారని దాన్ని  వంద టీఎంసీలకు పెంచాలని  డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం డిసెంబర్ 5న రాయలసీమలోని అన్ని జిల్లాల మండల కార్యాలయాల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలన వల్ల చిత్తూరు జిల్లాలోనూ నీటి సమస్య పెరిగిపోయిందన్నారు. సమావేశం జరుగుతుండగా టీడీపీ నాయకులు మధ్యలో వచ్చి సమైక్యవాదానికి మద్దతు తెలపాలని ఆయన్ను డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని వదిలి సమైక్యానికి కట్టుబడితే తాను చెవులు కోసుకుంటానని వారితో నారాయణ అన్నారు.

 

28, 29న ఢిల్లీలో బైరెడ్డి ధర్నా


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విడదీస్తే రాజధానిని సీమాంధ్రలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. రాజధాని ఏర్పాటుతో పాటు నీటి ఒప్పందాలు సక్రమంగా జరగాలని, అలా కాని పక్షంలో రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.


 

మరిన్ని వార్తలు