ఉపాధికి గండికొట్టారని ఉక్రోశం

22 Jun, 2014 03:24 IST|Sakshi
ఉపాధికి గండికొట్టారని ఉక్రోశం

ఇరాక్‌లో ఇండియన్లే టార్గెట్
క్యాంపుల పరిసరాల్లో కాల్పులు, బాంబు దాడులు

మోర్తాడ్ (నిజామాబాద్):ఇరాక్‌లోని భారతీయ కార్మికులు బిక్కుబిక్కుమంటున్నారు. అంతర్యుద్ధం ప్రాణగండంగా మారింది. అక్కడ పలు కంపెనీల క్యాంపుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. ఇరాక్‌లోని వివిధ కంపెనీల్లో ఎక్కువ మంది భారతీయులే పని చేస్తున్నారు. దీంతో తమ ఉపాధికి గండి పడిందని ఇరాకీ ఆందోళనకారులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహాదీ సున్నీ మిలిటెంట్లు భారతీయులను టార్గెట్ చేశారు. తారీక్ నూర్ ఆల్ హుదా కంపెనీకి చెందిన 40 మంది భారతీయ కార్మికులను బంధించారు. సైన్యం కాల్పుల నేపథ్యంలో 16 మంది కార్మికులు వారి చెర నుంచి బయటపడ్డారు. అలా బయటికి వచ్చినవారు అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఫోన్లు చేసి ‘ఎవరూ ఇక్కడ ఉండొద్దు, ఇరాకీలు భారతీయులనే టార్గెట్ చేస్తున్నారు’ అని అప్రమత్తం చేశారని కిర్కుక్‌లోని కార్వంచి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ గ్రూపులోని తెలుగు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.

కిర్కుక్‌లోని కార్వంచి సాఫ్ట్ డ్రింక్ కంపెనీ క్యాంపులో ఉన్న తెలుగువారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. క్యాంపు సమీపంలో కాల్పులు జరిగిన నాటి నుంచి కార్మికులను గదుల్లోనే బంధించారు. వాచ్‌మన్ల కళ్లు గప్పి గదుల నుంచి బయటకు వస్తున్నామని నిజామాబాద్ జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు. కిర్కుక్ క్యాంపునకు సమీపంలోని పట్టణంలో గురువారం రాత్రి కాల్పుల శబ్దం వినిపించిందని, అప్పటి నుంచి భయబ్రాంతులకు గురవుతున్నారని ఆయన వాపోయాడు. కిర్కుక్ క్యాంపునకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలమానియా పట్టణంలో శనివారం బాంబుదాడులకు తెగబడ్డారని తెలిపారు. ప్రభుత్వం బాధితులను స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినా కార్యరూపం దాల్చకపోవడంతో ఇరాక్‌లోని భారతీయులు, ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇరాక్‌లో ఉన్నవారిని ఇళ్లకు చేర్చాలని కార్మికులు వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు