యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్షులు

31 Aug, 2019 04:47 IST|Sakshi

అయినా ఎందుకు విచారించలేదు : హైకోర్టు

అక్రమ మైనింగ్‌ కేసులో ముగిసిన వాదనలు

సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు ధర్మాసనం సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 మంది సాక్షులు యరపతినేనికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినా అతన్ని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని నిలదీసింది.  

లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజం తరలిపోవడమంటే.. అధికారుల సహకారం లేకుండా సాధ్యమయ్యే పనే కాదని, ఆ అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్‌ తవ్వకాలు చేస్తున్నారని కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాగ్‌  దాఖలు చేసిన కౌంటర్‌లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో గనుల శాఖ అధికారులు సక్రమంగా పని చేయలేదని తేల్చి చెప్పిందని వివరించారు. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. 31,30,420 మెట్రిక్‌ టన్నుల అక్రమ మైనింగ్‌ జరిగిందని వివరించారు. రూ.20.16 కోట్ల సీనరేజీ ఎగవేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు