రబీ లేనట్టే?

2 Nov, 2014 01:20 IST|Sakshi
రబీ లేనట్టే?
  • సాగునీటివనరులు ధ్వంసం
  •  నాశనమైన ఖరీఫ్ పంటలు
  •  రుణాలివ్వని బ్యాంకర్లు
  •  అప్పులు పుట్టక అన్నదాతకు అవస్థలు
  •  రబీని వదులుకునేందుకు సిద్ధం
  • జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ కలిసిరాలేదు. చేతికొచ్చే స్థితిలో పంట హుదూద్‌కు సర్వనాశనమైపోయింది. పెట్టుబడులు పెనుగాలులకు తుడిచిపెట్టుకుపోయాయి. సాగునీటి వనరులు దెబ్బతినడంతో రబీపై ఆశలూ ఆవిరై పోతున్నాయి. మదుపులు దక్కని స్థితిలో మళ్లీ అప్పులు చేసి సాగుచేసే సాహసం చేయలేకపోతున్నారు.
     
    సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 37వేల హెక్టార్ల్ల(93వేల ఎకరాలు). సుమారు 50వేల మంది రైతులు వరి,అపరాలతో పాటు ఇతర వాణిజ్యపంటలను ఈ కాలంలో చేపడుతుంటారు. 15వేల ఎకరాల్లో వరి, 60వేల ఎకరాల్లో అపరాలు, 5వేల ఎకరాల్లో వేరుశనగ, మరో 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తుంటారు. మరో పదివేల ఎకరాల్లో ఇతర పంటలు ఉంటాయి. వీటన్నింటికీ చెరువులు, కాలువలు వంటి సాగునీటి వనరులే ఆధారం. వర్షాలు అనుకూలించి వీటిల్లో సమృద్ధిగా నీటి నిల్వలుంటేనే పూర్తి ఆయకట్టులో సాగుకు అవకాశం ఉంటుంది.

    హదూద్ కారణంగా జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సాగు నీటి వనరులన్నీ చాలావరకు దెబ్బతిన్నాయి.గ్రోయిన్లు, స్లూయిజ్‌లు, చెక్‌డామ్‌లు ధ్వంసమయ్యాయి. కాలువలు, చెరువుల గట్లు కొట్టుకుపోయాయి. రబీకి సరిపడా నీటి నిల్వలు లేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులతో రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. తుపానుకు చేతికొచ్చే దశలో ఖరీఫ్ పంటలు నాశనమైపోయాయి. పెట్టుబడులు కూడా దక్కక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఈ ఏడాది ఖరీఫ్ నాట్లు ఆలస్యమయ్యాయి. ఉన్న కొద్దిపాటి పంటల కోతలు డిసెంబర్‌లో కానీ పూర్తికావు. అంటే అనంతరమే రైతులు సాగు పనులకు ఉపక్రమించాలి.

    యథార్ధంగా రబీ అక్టోబర్ మొదటి వారంలోనే ప్రారంభమవ్వాలి. ఆదిశగా వ్యవసాయాధికారుల రబీ సన్నద్ధత కానరావడం లేదు. ప్రణాళికను ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే రబీకోసం 8వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్‌పెట్టింది. ఇక ఇప్పటికిప్పుడు కొత్త అప్పులు పుట్టే పరిస్థితుల్లేవు. రుణమాఫీ పుణ్యమా అని బ్యాంకర్లు అన్నదాతల ముఖం చూడడం లేదు. హుదూద్‌లో పంట నష్టంపై ప్రభుత్వం నోటిఫై చేస్తే రైతుల రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. అయితే రుణమాఫీ పుణ్యమాని గత ఖరీఫ్‌లో రుణాలు తీసుకున్న రైతులను వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు.

    దీంతో రీషెడ్యూల్ పరిధిలోకివచ్చే వారుకూడా అత్యల్పంగానే ఉంటారు. మరొక పక్క రుణమాఫీ పరిధిలోకి వచ్చే పాత బకాయిలు వడ్డీతో సహా తడిసిమోపెడ య్యాయి. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోవడ్డీలకు అప్పులు చేసిమరీ సాగుకు రైతులు సిద్ధంగా లేరు. ఒక వైపు నీటివనరుల్లేక..కొత్త రుణాలు పుట్టని ఈ పరిస్థితుల్లో రబీసాగుకు దూరంగా ఉండడమే మేలని రైతులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ ఏడాది రబీసాగయ్యే పరిస్థితులుకన్పించడంలేదు.

>
మరిన్ని వార్తలు