దేశ సేవలోనే తుది శ్వాస

8 Mar, 2019 07:57 IST|Sakshi
రమేష్‌ పార్థివదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్తున్న సైనిక సిబ్బంది

విధి నిర్వహణలో కాలికి గాయం

ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి

స్వగ్రామం వీఎన్‌పురంలో  అంతిమ వీడ్కోలు

శ్రీకాకుళం , నరసన్నపేట రూరల్‌: విధి నిర్వహణలో భాగంగా గాయపడిన ఆర్మీ ఉద్యోగి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామం వీఎన్‌పురం తీసుకురావడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు సైనిక లాంఛనాలతో గురువారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.మండలంలోని వీఎన్‌పురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి చల్ల రమేష్‌ (34) 16వ మద్రాస్‌ ఇంజినీర్‌ రెజిమెంట్‌ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట బరువైన వస్తువు తగిలి అతడి కాలికి గాయమైంది. ఆ తర్వాత గాయానికి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఢిల్లీలోని ఎంహెచ్‌ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మృతి చెందారని సుబేదర్‌ భాస్కరరావు తెలిపారు.

తల్లడిల్లిన చిన్నారి  
స్వగ్రామానికి శవపేటికలో రమేష్‌ మృతదేహాన్ని సైనిక సిబ్బంది తీసుకొచ్చారు. ఇక్కడ్నుంచి వెళ్లిన భర్త విగతజీవిగా కనిపించడంతో భార్య అరుణ జీర్ణించుకోలేకపోయింది. గండెలవిసేలా రోదించింది. ఈమెతోపాటు అతడి తల్లి నరసమ్మను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చిన్నారి అభిషేక్‌(9) తన తండ్రి పార్థివదేహానికి వందనం చేస్తూ కన్నీటి పర్యంతయ్యాడు. ఇంతలో అక్కడవారు ఓదార్చుతుండగా ‘డాడీ..రా..డాడీ’ అంటూ బోరుమని ఏడుస్తున్న ఘటన చూపరులను కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు హూటహుటిన ఇక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

సైనిక సిబ్బంది ఘన నివాళి
ఈ సందర్భంగా రమేష్‌ పార్థివదేహంపై సైనిక అధికారులు జాతీయ పతాకాన్ని కప్పారు. సుబేదర్‌ భాస్కరరావు, సైనిక సిబ్బంది సోమేశ్వరరావు, పీటీరావు, శ్రీనివాసరావు, శంకరరావు, సిగ్ననల్‌మేన్‌ శ్రీనివాసరావు శోకతప్త హృదయాలతో గౌరవ వందనం చేస్తూ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పార్థివదేహానికి అంతిమయాత్ర నిర్వహించి, స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంతిమ యాత్రలో వైఎస్సార్‌ సీపీ మండల యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య, మాజీ సర్పంచ్‌ పుట్ట ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు