రిటైర్‌మెంట్‌తో తిరిగి వస్తానని వెళ్లి...

10 Oct, 2019 10:07 IST|Sakshi

సాక్షి, మందస : మరో ఏడాదిపాటు మాత్రమే పని చేస్తాను.. ఇక రిటైర్‌మెంట్‌ తర్వాత వచ్చి కుటుంబంతో హాయిగా జీవిస్తానని చెప్పి వెళ్లిన రెండ్రోజులకే ఆర్మీ ఉద్యోగి మరణవార్త విన్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దసరాకు వచ్చిన ఈయన విధుల్లో చేరి రెండు రోజులైనా గడవక ముందే అందని లోకాలకు వెళ్లిపోవడంతో మండలంలోని మఖరజోల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బమ్మిడి సురేష్‌కుమార్‌(36) ఆర్మీ పోలీస్‌గా కోల్‌కత్తాలో పని చేస్తున్నాడు. విజయ దశమికి సెలవుపై వచ్చిన ఈయన తనకు ఏడాది మాత్రమే సర్వీసుందని, వచ్చే ఏడాది స్వగ్రామం వచ్చేస్తానని తల్లిదండ్రులు ఆనందరావు, మోహినిలకు చెప్పి విధులు నిర్వహించడానికి ఈ నెల 7న తిరిగి వెళ్లిపోయాడు.

క్షేమంగా చేరానని చెప్పిన రెండు రోజులకే విధి నిర్వహణలో మరణించారని కబురు అందడంతో మృతుని కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు సురేష్‌ మందస ఎంపీడీవోకు స్వయాన మేనల్లుడు. మృతదేహాన్ని మఖరజోలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబీకులకు మృతదేహాన్ని అందజేయడానికి ఆర్మీ అధికారులు కూడా సహకరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దసరా పండగకు వచ్చి తిరిగి వెళ్లి మూడు రోజులకే విగతజీవిగా వస్తాడని కలలో కూడా ఊహించలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య దీపిక, కుమారుడు జితేంద్ర, కుమార్తె రూప ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు