కదిలిన యువసేన

18 Jan, 2014 04:58 IST|Sakshi

కొత్తగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాలకు ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శుక్రవారం ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభ సూచికగా ఆర్మీ, పోలీస్, సింగరేణి ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది పట్టణంలో కవాతు నిర్వహించారు. ర్యాలీ కో-ఆర్డినేటర్, కొత్తగూడెం ఆర్డీఓ దుగ్యాల అమయ్‌కుమార్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజుభాస్కర్, సింగరేణి జీఎం (పర్సనల్) కె.బాబుసత్యసాగర్ ఆర్మీ ర్యాలీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ కవాతు పోస్టాపీస్ సెంటర్, బస్టాండ్ సెంటర్, సింగరేణి ఎస్‌అండ్‌పీసీ కార్యాలయం మీదుగా సాగింది. ఆర్మీ ర్యాలీలో పాల్గొనే పోలీస్ సిబ్బందికి కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు విధులను కేటాయించారు. ఆర్మీ ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా వన్‌టౌన్ సీఐ ఎ.నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. మైక్ ద్వారా ఆర్మీ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులకు సలహాలు సూచనలు అందించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు 100 మంది ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బందికి ఆర్డీవో డి.అమయ్‌కుమార్ విధులను కేటాయించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వీరికి ఆర్మీ ర్యాలీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
 
 అభ్యర్థుల కోలాహలం...
 అతి చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు, దేశ రక్షణలో పాలుపంచుకునేందుకు ఆర్మీ చక్కని అవకాశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారీ సంఖ్యలో అభ్యర్థులు తర లివస్తున్నారు. తొలిరోజు ఎంపికల కోసం సుమారు ఆరువేల మంది వస్తారని అంచనా.  శుక్రవారం సాయంత్రానికే పట్టణానికి నాలుగువేలమంది దాకా అభ్యర్థులు వచ్చారు.  ర్యాలీకి అవసరమైన జిరాక్స్ ప్రతులను ఏర్పాటు చేసుకోవడం, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను తీయించుకోవడంలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. అభ్యర్థులు భారీ సంఖ్యలో పట్టణానికి చేరుకోవడంతో టిఫిన్ సెంటర్లు, భోజన హోటల్స్‌లు అభ్యర్థులతో కళకళలాడాయి. నియామక పరీక్షల్లో భాగంగా తొలిరోజు సోల్జర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పరుగుపోటీ నిర్వహిస్తారు.
 
 ఉద్యోగంపై ఆశలు..రోడ్లపై పడిగాపులు...
 ఆర్మీ ర్యాలీని 17న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా 18వ తేదీ తెల్లవారుజామునుంచే నియామక పరీక్షలను ఏర్పాటు చేశారు. అయితే సమాచార లోపంతో ఎక్కువ మంది అభ్యర్థులు ఒకరోజు ముందుగానే పట్టణానికి చేరుకుని ఇబ్బందులు పడ్డారు. తలదాచుకునేందుకు సరైన సౌకర్యాలు లేక అభ్యర్థులు రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొంతమంది మూసి ఉన్న దుకాణాలను అడ్డాగా చేసుకొని సేద తీరారు. మరికొందరు ఉన్న జాగాలోనే వ్యాయామం చేసుకుంటూ ఆర్మీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఎక్కువ మంది అభ్యర్థులు రావడంతో పోలీసులు వన్‌టౌన్ సీఐ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో వీరిని స్థానికంగా ఉన్న కల్యాణ మండపాలకు తరలించారు.
 
 అధిక ధరలపై ప్రత్యేక నిఘా
 ఆర్మీర్యాలీ కోసం భారీస్థాయిలో అభ్యర్థులు తరలిరావడంతో స్థానికంగా ఉన్న జిరాక్స్, హోటల్స్, ఫొటో స్టూడియోల నిర్వాహకులు  కొందరు ధరలు అమాంతం పెంచారు. అభ్యర్థుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్ జిరాక్స్, ఫొటోస్టూడియోలు, హోటల్స్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీలు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలను తీసుకునే అవకాశం ఉండటంతో ఈ విషయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆర్డీవో అమయ్‌కుమార్ తెలిపారు. ఎవరైనా అధిక ధరలు తీసుకున్నట్లు తమ దృష్టి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు