ఆర్మీర్యాలీకి తరలివస్తున్న జిల్లా యువకులు

21 Jan, 2014 05:30 IST|Sakshi

కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెంలో కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు భారీగా తరలివస్తున్నారు.  సోమవారం  జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికలు జరుగగా  ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన  3,230 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో దాదాపు రెండు వేల మంది ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉండటం గమనార్హం.
 
 సైనిక ఎంపికల ప్రక్రియ మూడోరోజు సోమవారం నాడు ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, మధిర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వీరితోపాటు ఏజెన్సీలోని నిరుద్యోగ యువకులు 200 మందిని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తీసుకువచ్చారు. సింగరేణి సేవా సమితి ద్వారా సీఎస్‌ఆర్ పాలసీ కింద మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన 62 మందికి గత నెల రోజులుగా ఉచిత శిక్షణ ఇచ్చి వారిని ఈ ఎంపికలకు తరలించారు. ఉదయం నాలుగు గంటలకే అభ్యర్థులకు టోకెన్ పంపిణీ, ఎత్తు కొలతలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు రాత్రి రెండు గంటల నుంచే స్థానిక జూనియర్ కళాశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి 8.30 గంటల వరకు అధికారులు అభ్యర్థులకు టోకెన్లు అందించి  ఎత్తు కొలతలు తీసుకున్నారు. ఉదయం 5 గంటల సమయంలో మంచు ఎక్కువగా ఉండటంతో 5.30 గంటల నుంచి పరుగు పోటీప్రారంభించారు. అయితే ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు నీరసించి పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 ఫలించిన పోలీసులు, సింగరేణి కృషి...
 జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 200 మంది గిరిజన నిరుద్యోగ యువకులను గుర్తించిన జిల్లా పోలీస్ శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్‌లో వీరికి వసతులు ఏర్పాటు చేసి ఆర్మీ ర్యాలీ కోసం శిక్షణ ఇచ్చారు. ర్యాలీలో పాల్గొన్న వీరిలో సుమారు 80 మంది వరకు పరుగు పోటీలో విజయం సాధించారు. వీరికి మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.  వీరితోపాటు సింగరేణి అధికారులు శిక్షణ ఇచ్చి తీసుకువచ్చిన 62మంది అభ్యర్థులలో 28మంది పరుగులో విజేతలుగా నిలిచారు.
 
 పరుగుపందెం ప్రారంభించిన జిల్లా కలెక్టర్..
  ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన పరుగుపందెంను ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎనిమిది గంటల వరకు స్టేడియంలో ఉన్న ఆయన ఎంపిక తీరును అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ యువత సేవలు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఆర్మీలో చేరాలనే ఉత్సాహం యువకుల్లో ఉండటం అభినందనీయమన్నారు. ఆర్మీ ర్యాలీలో తిరస్కరణకు గురైన వారు నిరుత్సాహ పడకుండా మరోమారు జరిగే ఎంపికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జిల్లాలో జరగడం జిల్లాకు చెందిన అభ్యర్థులకు మంచి అవకాశమన్నారు.  ర్యాలీకి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట జేసీ సురేంద్రమోహన్, కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, సింగరేణి జీఎం (పర్సనల్) కె.బి.ఎస్.సాగర్, డీఎస్పీ రంగరాజు భాస్కర్, తహశీల్దార్ కె.పి.నర్సింహులు తదితరులున్నారు.
 
 ర్యాలీని పరిశీలించిన ఆర్మీ బ్రిగేడియర్..
 ఆర్మీ బ్రిగేడియర్ ఎస్.బి.సజ్జార్ ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి తిరుగుతూ అక్కడ అభ్యర్థులకు పరీక్షలు చేస్తున్న విధానాన్ని  క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్ ఏర్పాట్లను బ్రిగేడియర్‌కు వివరించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి వారి వివరాలను, ఆర్మీ ర్యాలీకి వచ్చే ముందు శిక్షణ తీసుకున్నారా..? ఎన్నోసారి హాజరవుతున్నారు..? గతంలో ఎందుకు సెలెక్ట్ కాలేదనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వరకు ర్యాలీ ప్రదేశంలో ఉన్న ఆయన ఎంపిక తీరును పరిశీలించారు. ఆర్మీ ర్యాలీని అసిస్టెంట్ కలెక్టర్ మల్లికార్జున్ పరిశీలించారు. ఐఏఎస్ ట్రైనింగ్‌లో భాగంగా కొత్తగూడెం పట్టణానికి వచ్చిన ఆయన ప్రకాశం స్టేడియంలో జరిగే ఆర్మీ ర్యాలీ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

>
మరిన్ని వార్తలు