కొలువుల జాతర

24 Jan, 2014 03:38 IST|Sakshi

కొత్తగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాలకు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆర్మీ నియామక ర్యాలీ శుక్రవారం నాటితో ముగియనుంది. నాలుగేళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ర్యాలీకి భారీగా తరలివచ్చారు. పది జిల్లాల నుంచి 27,056 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారం రోజులపాటు జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో గురువారం నాటికి పరుగు, దేహదారుఢ్య పరీక్షలు ముగిశాయి. మొత్తం 27,056 మంది హాజరుకాగా, 8,105 మంది ఎత్తు కొలతల్లో అనర్హులయ్యారు. 18,951 మంది అభ్యర్థులు పరుగులో పాల్గొన్నారు.
 
 వీరిలో 5,291 మంది తదుపరి అంశాలకు ఎంపికయ్యారు. ఎంపిక పరీక్షల సందర్భంగాస్థానిక ప్రకాశం స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాలు నిరుద్యోగులతో నిండిపోయాయి. సాధారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉండే కొత్తగూడెంలో 20, 21, 22 తేదీలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున 5.30 గంటలకు పరుగు ప్రారంభం అయినప్పటికీ మధ్యాహ్నం మూడు, నాలుగు గంటల వరకు కొనసాగాయి. ఉదయం 10 గంటల తర్వాత పరుగు పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు ఎండ తీవ్రత కారణంగా నీరసించారు. ఈ మూడు రోజుల్లో 13 మంది అభ్యర్థులు ఎండతీవ్రతతో సొమ్మసిల్లిపోయారు.
 
 సేవల పరంపర..
 పది జిల్లాల నుంచి తరలివచ్చిన ఆర్మీ అభ్యర్థులపై కొత్తగూడెం వాసులు తమ ఔదర్యాన్ని చాటారు. ఆర్మీ ఏర్పాట్లను సింగరేణి సంస్థ నిర్వహించగా, పోలీస్‌శాఖ నుంచి విధులకు హాజరైన పోలీసులకు నవభారత్ సంస్థ భోజన వసతి సమకూర్చింది. మెడికల్ అసోసియేషన్ వారు అభ్యర్థులకు గ్లూకోజ్ అందించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభ్యర్థులకు ప్రతిరోజు మజ్జిగ ఇచ్చారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్యలు సంయుక్తంగా రెండు రోజుల పాటు హాజరైన అభ్యర్థులకు ఉచిత భోజనం సమకూర్చారు. రక్ష స్వచ్ఛంద సంస్థతోపాటు మరికొంత మంది అభ్యర్థులకు భోజన వసతి కల్పించడం గమనార్హం. క్యాటరింగ్ నిర్వాహకులు కూడా తక్కువ ధరలకే భోజనం అందించారు.
 
 నేడు ముగింపు..
 ఆర్మీ ర్యాలీ శుక్రవారం ముగియనుంది. గురువారం నిర్వహించిన సోల్జర్ ట్రేడ్స్‌మన్ విభాగానికి తెలంగాణలోని పది జిల్లాల నుంచి 6,285 మంది అభ్యర్థులు హాజరుకాగా అందులో 1,897 మంది అభ్యర్థులు ఎత్తు కొలతల్లో విఫలమయ్యారు. 4,388 మంది  పరుగులో పాల్గొనగా వీరిలో 1,145 మంది అభ్యర్థులు మెడికల్ పరీక్షలకు ఎంపికయ్యారు. చివరి రోజు జరిగిన పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్థులు హాజరుకావడం గమనార్హం. చివరిరోజైన శుక్రవారం ఈ అభ్యర్థులకు ఆర్మీ అధికారులు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు