కొండంత అండ.. ఆరోగ్యశ్రీ

7 Apr, 2019 10:31 IST|Sakshi

 ఏడాదికి రూ.5 లక్షలలోపు ఆదాయం  ఉన్నవారందరికి ఆరోగ్యశ్రీ 

హాస్పిటల్‌లో చేరిన రోగి ఖర్చు వెయ్యి దాటితే  ఆరోగ్యశ్రీ వర్తింపు

జగనన్న భరోసాతో  పేదవర్గాల్లో  మనోస్థైర్యం

ఆర్థిక బాధల నుంచి విముక్తి లభిస్తుందని  అన్ని వర్గాల్లో హర్షం  

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తానని ప్రకటించిన యూనివర్సిల్‌ హెల్త్‌ కార్డులతో ఆరోగ్య సిరిగా మారుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయపరులకు కార్పొరేట్‌ వైద్యశాలల్లో ఉచిత వైద్యం, రూ.వెయ్యి దాటిని వైద్యం ఖర్చులను ఆరోగ్యశ్రీలో వర్తింప చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించడంతో పేద, మధ్య తరగతుల్లోని సామాన్యులందరికీ ‘కొండంత ఆరోగ్యం’ కల్పిస్తుంది. వైఎస్సార్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీలో ఎన్నో వైద్య సేవలను పేదలు  ఉచితంగా పొందారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చాయి.  

నెల్లూరు(బారకాసు):  ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించడమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని (ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్యసేవ) టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి అనారోగ్యశ్రీగా మార్చింది. పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సర్కార్‌ తన చర్యల ద్వారా పథకం అమలును పూర్తిగా అటకెక్కిస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.వంద కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడంతో పాటు 133 శస్త్ర చికిత్సల తొలగింపు, సిబ్బంది కొరతతో పనిభారం తదితర వాటి ద్వారా పథకం నీరుగారిపోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి చికిత్స లభించడం లేదని కొందరు ఉద్యోగులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల అమలుపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం అమలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వైఎస్సార్‌ హయాంలో ప్రతి పది రోజులకోసారి ప్రభుత్వం బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏడాదికోసారి బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా ఈహెచ్‌ఎస్‌ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఏటా రూ.100కోట్లు చెల్లిస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.500 కోట్లకు పైగా చెల్లించారు. అయినా వారికి నగదు చెల్లించనిదే వైద్యం అందే పరిస్థితి లేదు.

వైద్యసేవ నుంచి శస్త్రచికిత్సల తొలగింపు 
వైఎస్సార్‌ హయాంలో గర్భసంచి, హెర్నియా ఆపరేషన్‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేయించుకునే వెసులుబాటు ఉండేది. దీంతో పేదలు వేలాది రూపాయలు వెచ్చించకుండానే కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ చేయించుకునేవారు. టీడీపీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది. ప్రధానంగా వైఎస్సార్‌ ఆకాల మరణం తర్వాత 133 శస్త్ర చికిత్సలను తొలగించింది. వీటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసేలా ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అపెండిసైటీస్, గాల్‌బ్లాడర్, ప్రొలాప్స్, ఒవరీట్యూబ్స్, ఫైబ్రాయిడ్స్, రక్తస్రావం తదితర కేసులను ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేసేలా చర్యలు తీసుకోకపోవడంతో పేద, సామాన్య ప్రజానీకానికి కార్పొరేట్‌ వైద్యం దూరమవుతోంది.
ముక్కుపిండుడే 
గతంలో ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్‌ కార్డు ఉందంటే ఆరోగ్యమిత్రలు ఆ పేషెంట్‌ పేరును రిజిస్టర్‌ చేసుకుని, అన్నీ సేవలు ఉచితంగా లభించేలా చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ఫ్రీ ఆథరైజేషన్‌ వచ్చే వరకు అయ్యే ఖర్చులు రోగులే భరించాలి. ఒకవేళ ఫ్రీ ఆథరైజేషన్‌ వచ్చాక కూడా ప్రైవేట్‌ ఆస్పత్రులు డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. నగరంలోని చాలా ఆస్పత్రుల్లో ఈ దారుణమైన పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగులతో ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నారు.

వేధిస్తున్న వైద్యమిత్ర కొరత 
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ) పథకం ద్వారా వైద్య సేవలు పొందాలనుకునే రోగులు ఈ పథకం అనుమతి ఉన్న ఆస్పత్రికి వెళ్లగానే ముందుగా అక్కడున్న ఆరోగ్య మిత్రను కలిసి కార్డు అందజేస్తే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటాడు. ఇటువంటి ఆరోగ్య మిత్రలు 51 ఆస్పత్రుల్లో 174 మంది ఉండాల్సి ఉండగా కేవలం 102 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత వలన కొన్ని మల్టీస్పెషాల్టీ హాస్పిటల్‌లో రౌండ్‌ ది క్లాక్‌ అంటే 24 గంటలూ విధులు నిర్వర్తించేందుకు ముగ్గురు వైద్య మిత్రలు షిఫ్ట్‌ల వారీగా ఉండాలి.

కానీ ఒక్కరే రోజంతా విధులు నిర్వర్తించడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని హాస్పిటల్స్‌లో అసలు వైద్య మిత్రలే లేరు. వైద్యమిత్ర లేని హాస్పిటల్‌కు రోగి వెళ్లితే అప్పుడు అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఫోన్‌ చేస్తే వేరే హాస్పిటల్‌లో ఉండే వైద్య మిత్ర ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో కొందరు ఇటువంటి ఉద్యోగం అవసరం లేదని.. పనిభారం భరించలేక ఉద్యోగాలకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

యూనివర్సిల్‌ హెల్త్‌ కార్డుల పథకం అద్భుతం
వైఎస్సార్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క అడుగు ముందుకేసి పేదలకే కాకుండా మధ్యతరగతి సామాన్యులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు తీసుకువచ్చిన యూనివర్సిల్‌ హెల్త్‌ కార్డుల పథకం అద్భుతమని సర్వత్రా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి వర్తింప చేయనుడడంతో ఈ పథకం ద్వారా జనాభాలో 90 శాతం ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది.

కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందే రోగులకు రూ.వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స, ఆరోగ్యశ్రీ కార్డున్న వారందరూ పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ హాస్పిటల్‌ల్లోనైనా చికిత్స పొందే సదుపాయం. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను పటిష్టం చేస్తామన్నారు. జిల్లాలో లక్షలాది మందికి ఉచితంగా మెరుగైన వైద్యసేవలందే పరిస్థితులు కనపడుతున్నాయని, జగన్‌మోహన్‌రెడ్డి హామీ తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

26 లక్షల మందికి ప్రయోజనం

నెల్లూరు(పొగతోట): వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన యూనివర్సల్‌ హెల్త్‌కార్డుల ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 26 లక్షల మందికి ప్రయోజనం చేకుర్చే అవకాశం ఉంది. సంవత్సరానికి రూ. 5 లక్షల లోపు ఆదాయంలోపు ఉండే ప్రజలు, రైతులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ యూనివర్సల్‌ హెల్త్‌కార్డు ఉపయోగపడుతుంది. యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య సేవలు పొందే విధంగా రూపకల్పన చేశారు. జిల్లాలో 32.50 లక్షల జనాభా ఉన్నారు. ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు 24 లక్షల మందికిపైగా ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 60 వేల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకు రూ.40 వేలు వేతనం తీసుకునే ఉద్యోగులు కూడా 15 వేల మందికిపైగా ఉన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 30 వేల మందికిపైగా ఉన్నారు. నెలకు రూ.40 వేలలోపు వేతనం తీసుకునే ఉద్యోగులు కుటుంబంలో ఎవరికైన ఆరోగ్యం సరిగా లేకపోతే అప్పులు చేయాల్సి పరిస్థితి ఉంది. వడ్డీలకు డబ్బులు తీసుకుని ప్రతి నెలా చెల్లించే ఉద్యోగులు అధిక శాతం మంది ఉన్నారు.

వచ్చిన వేతనంతో వడ్డీలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి వారందిరికీ యూనివర్సల్‌ హెల్త్‌కార్డు ఏటీఎం కార్డులా పని చేస్తోంది. వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షల్లో ఖర్చులు చేయలేక అప్పుల పాలవుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఆరోగ్యం సరిగా లేకపోయిన రూ.5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా లభించే అవకాశం ఉంది. 


తీవ్ర నిర్లక్ష్యం 

ప్రభుత్వ నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తోంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వివిధ ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్యసేవ అందించే ఆస్పత్రులకు దాదాపు రూ.100 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి 4 నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. ప్రభుత్వ పలు దఫాలు చర్చలు జరిపి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా కనీసం 50 శాతం కూడా చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశ) ఆరోపిస్తోంది.

ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం కింద అందించే సేవలు మృగ్యమయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఉద్యోగులు వెళితే ఈహెచ్‌ఎస్‌ వర్తించదని, బిల్లులు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు గత్యంతరం లేక డబ్బులు చెల్లించి రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక ఆరోగ్య రక్ష పేరుతో ఒక్కో వ్యక్తితో రూ.1,250 తీసుకుని కార్డులందించారు. కానీ ఆ కార్డులు పనిచేయడం లేదు. జిల్లాలో మొత్తం 9,053 ఆరోగ్యరక్ష కార్డులున్నాయి.

మరిన్ని వార్తలు