చిరుద్యోగులపై చిన్నచూపు

15 Jan, 2019 08:01 IST|Sakshi

సమస్యల సుడిలో ఆరోగ్యమిత్రలు

ఏళ్లతరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత కరువు

దశాబ్దంగా రూ.6 వేల వేతనం

జిల్లాలో భర్తీ కాని 70 పోస్టులు

పనిభారం అల్లాడుతున్న వైనం

పశ్చిమగోదావరి, దెందులూరు : వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందించే ఆరోగ్య మిత్రలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 15 ఏళ్లుగా పనిచేస్తున్నా అరకొర జీతాలే చెల్లిస్తుండడం, ఉద్యోగ భద్రత కరువవడంతో వారు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య మిత్రల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారితోనే పని చేయిస్తుండడంతో వారు తీవ్ర పనిభారంతో అల్లాడుతున్నారు.   

జిల్లాలో 70 పోస్టులు ఖాళీ
జిల్లాలో 60 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో 170 పోస్టులు ఉండగా 100 మంది ఆరోగ్యమిత్రలు మాత్రమే ఉన్నారు. 70 పోస్టులు నియామకానికి నోచుకోలేదు. ఆరోగ్యమిత్రకు నెలకు రూ.6 వేలు జీతం ఇస్తున్నారు. మొదటి వారంలో మంజూరు కావాల్సిన ఆ జీతం కాస్తా నెల చివరిలో చేతికొచ్చే వరకూ సందేహమే. 15 ఏళ్లుగా ఆరోగ్యమిత్రలకు రూ.6 వేలు మాత్రమే వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. జీతంలో పెరుగుదల లేకపోవడంతో పాటు ఉద్యోగ భద్రత కరువవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒక రోజు ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందని, జీతం పెరుగుతుందనే ఆశతో పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేవలు భేష్‌
పేషెంట్‌ వైద్యశాలలో చేరినప్పటి నుంచి ఓపీ షీటు నమోదు దగ్గర నుంచి శస్త్రచికిత్స జరిగి వైద్య సేవలు పొంది ఇంటికి వెళ్లేందుకు డిశ్చార్జి అయ్యేంత వరకు ఆరోగ్యమిత్రలు సేవలందిస్తారు. పేషెంట్‌లకు ఒక్క రూపాయి కూడా ఖర్చవకుండా చూసుకునే పూర్తి బాధ్యత వైద్యశాలల్లో ఆరోగ్య మిత్రలదే. ఒక్కో ఆరోగ్యమిత్ర 8 గంటలు చొప్పున విధులు నిర్వహిస్తారు. దినసరి కూలీలు కూడా నేడు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు సంపాదిస్తున్నారు. కానీ ఆరోగ్యమిత్రలపై మాత్రం ప్రభుత్వం కరుణ చూపడం లేదు.

ఆరేళ్లుగా యూనిఫామ్‌ కరువు
2012లో ఆరోగ్య మిత్రలకు ఒక ఎఫ్రాన్‌ (యూనిఫామ్‌) ఇచ్చారు. అప్పటి నుంచి ఆరేళ్లుగా ఆరోగ్యమిత్రలకు యూనిఫామ్‌లు ఇవ్వటం లేదు. సెలవులు సైతం లేవు. ఒకవైపు ప్రభుత్వం నెట్‌వర్క్‌ వైద్యశాలలకు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలు పెండింగ్‌ ఉండటం, మరో వైపు పేషెంట్‌ చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకూ సేవలందించే ఆరోగ్యమిత్రలకు ఉద్యోగ భద్రత, జీతంపెంపు, యూనిఫాం ఇవ్వకపోవడం వంటి ప్రధాన సమస్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో జిల్లాలోని వంద మంది ఆరోగ్య మిత్రలు దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అనేకసార్లు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం తమ సమస్యలను 15 ఏళ్లుగా పెడచెవిన పెట్టిందని ఆరోగ్యమిత్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

15 ఏళ్లుగా సేవలు
15 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 8 గంటల పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య మిత్రలకు కనీస వేతనం, యూనిఫాం, నిబంధనల ప్రకారం సెలవులు, నెల మొదటి వారంలో జీతం జమ చేయాలి. ఆరోగ్యమిత్రల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు అధ్యాయన కమిటీని ఏర్పాటు చేయాలి.
– పీవీ ప్రసాద్, ఆరోగ్య మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు