సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

15 Dec, 2014 00:53 IST|Sakshi

ఒంగోలు టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కొండపిలో నిర్వహించనున్న పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం అక్కడే ఉంటారన్నారు. జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌తో కలిసి ఆదివారం స్థానిక సీపీఓ కాన్ఫెరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం కొండపిలోని ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే రైతు సాధికారిత సదస్సులో పాల్గొంటారన్నారు. రైతులతోపాటు పింఛన్‌దారులు, ఇసుక రీచ్‌లపై డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు.

సదస్సు వద్దనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి మీ సేవ కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి రుణం ఎంత మాఫీ అయిందన్న విషయాలను ఆన్‌లైన్‌లో అక్కడే తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సదస్సు వద్ద వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించనున్నట్లు, పశువైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

మధ్యాహ్నం జిల్లా అభివృద్ధికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. రైతుల రుణమాఫీతోపాటు ఇటీవల జరిగిన జన్మభూమి -మా ఊరు కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ విలేజ్ తదితర అంశాలపై చర్చిస్తారన్నారు. ఆ తరువాత సమయాన్ని బట్టి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారని వివరించారు. ఇప్పటివరకు 51 వేల మంది రైతుల వివరాలు అప్‌లోడ్ చేసినట్లు చెప్పారు. మిగతా రైతులకు సంబంధించి జనవరి 8వ తేదీలోపు అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు వివరించారు.

రుణమాఫీకి మూడంచెల విధానం
రుణమాఫీకి సంబంధించి అర్హులైన వారి పేర్లు లేని రైతుల కోసం మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మండల స్థాయిలో తహసీల్ధార్ కన్వీనర్‌గా మండల వ్యవసాయాధికారి కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తారని, వారి దృష్టికి రైతులు తమ వివరాలు తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి ఆ రైతులకు రుణమాఫీ వర్తించే విషయమై చర్యలు తీసుకుంటారన్నారు. మండల స్థాయిలో రైతుకు న్యాయం జరగకుంటే డివిజనల్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారుల వద్ద అప్పీలు చేసుకోవచ్చన్నారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే జిల్లా స్థాయి కమిటీ వద్ద రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి కమిటీ సంబంధిత రైతు వివరాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు.

మీడియాకు కూడా ఏర్పాట్లు: ఎస్పీ విజ్ఞప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన వార్తలు కవరేజీ చేసేందుకు వచ్చే పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు.
 
ఎలాంటి  లోటుపాట్లు లేకుండా చూడాలి
ఒంగోలు టౌన్:  ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో చంద్రబాబునాయుడు అకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సీఎం పర్యటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కందుకూరు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షా సమావేశాల్లో సీఎం అడిగిన వెంటనే సంక్షిప్తంగా సమాధానం చెప్పేవిధంగా సిద్ధంగా ఉండాలని, అవసరమైన సమాచారాన్ని ముఖ్య ప్రణాళికాధికారికి అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కొండపి శాసనసభ్యుడు డోల బాలవీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, కందుకూరు సబ్ కలెక్టర్ మల్లికార్జున, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు