పకడ్బందీగా పుష్కరాల ఏర్పాట్లు

19 May, 2016 05:16 IST|Sakshi
పకడ్బందీగా పుష్కరాల ఏర్పాట్లు

  రూ. 150కోట్ల నిధులు మంజూరు
ఆగస్టు 8లోగా పనులు పూర్తి
అధికారుల సమీక్షలో కలెక్టర్ వెల్లడి.
 

 
 శ్రీశైలం : ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణానది పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు.  శ్రీశైలంలో పుష్కర ఏర్పాట్లపై  దేవాదాయ కమిషనర్ అనురాధ, ఆర్డీఓ రఘుబాబు, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో కలిసి బుధవారం కలెక్టర్  క్షేత్రపర్యటన చేశారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 8లోగా పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు  ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. శ్రీశైలం పాతాళగంగ, లింగాలగట్టుతో పాటు  సంగమేశ్వరం వద్ద పుష్కరఘాట్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన 36 పనులకు  రూ.60 కోట్ల వ్యయం అంచనాలను రూపొందించి టెండర్లను పిలిచామన్నారు.

అలాగే రోడ్లు భవనాలశాఖ ద్వారా 11 పనులకు రూ. 29 కోట్లు, దేవాదాయశాఖ ద్వారా 23 పనులకు రూ. 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.  ఇవేకాకుండా ఆత్మకూరు, నందికొట్కూరుకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు.  మొదటి దశలొ శాశ్వత ప్రతిపాదికన జరిగే పనులు, రెండవదశలో డ్రెసింగ్ రూమ్స్, బాత్‌రూమ్స్, టాయిలెట్స్ నిర్మాణ పనులు, మూడవ దశలో పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, అత్యాధునిక సెక్యూరిటీ సిస్టం, విధుల కేటాయింపు తదితర పనులు జరుగుతాయన్నారు.  పనులన్నీ పూర్తి చేసి ఆగస్టు 8న ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు