ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం

8 Feb, 2014 04:02 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రానున్న సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో  నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్న దృష్ట్యా అధికార యం త్రాంగం సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలతో సంబంధమున్న పలువురు అధికారులు, తహశీల్దార్లు , ఎంపీడీవోల బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు. వీరిలో కొంతమంది మేడారం జాతర కారణంగా ఈ నెల 15వ తేదీ తర్వాత రిలీవ్ అయి బదిలీ స్థానాలకు వెళ్లనున్నారు. తాజాగా కలెక్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయమై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
 
  సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పాఠశాల భవనాలు, కళాశాలలు, గ్రామ పంచాయతీ, ప్రభుత్వశాఖల కార్యాలయాల భవనాలపై ఎలాంటి రాతలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం నుంచి సంబంధిత అధికారుల ద్వారా రాతలు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించాలన్నారు. ప్రైవేట్ భవనాలపై యజమాని అనుమతితోనే వాల్ రైటింగ్ చేయాలన్నారు.
 
 ఎన్నికల భద్రత ప్రణాళికలు, నియోజకవర్గాల వారీగా వివరాలతో హ్యాండ్‌బుక్ తయారు చేసి మంగళవారం     అందజేయాలన్నారు. జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
 
 త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
 
 గ్రామ స్థాయిలో వీఆర్‌వోలు, వీపీవోలు, బీఎల్‌వోలు, మండల స్థాయిలో తహశీల్దార్లు, ఎస్సైలు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎస్పీలు, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్ అధికారులు, సీఐలు, జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ఖర్చు వివరాలు పరిశీలిస్తారని వివరించారు.
 
 ఎన్నికల అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పనికి ఖర్చు వివరాలు సేకరించాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచాలన్నారు. అభ్యర్థులు పత్రికల్లో పెయిడ్ న్యూస్ రాయించుకుంటారని, ప్రతి రోజు పేపర్లు పరిశీలించాలని సూచించారు. అక్రమంగా డబ్బు రవాణాను అడ్డుకోవాలన్నారు.
 
 అభ్యర్థి ఖర్చు వివరాలకు ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా ప్రారంభించి అధికారులకు తెలియజేయాలని, ఖర్చులు ఆ ఖాతా నుంచే జరిగేలా చూడాలని అన్నారు. ఈ విషయాలపై రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
 సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్డీ సుబ్బారాయుడు, అదనపు జాయింట్ కలెక్టర్ ఎ.మనోహర్, జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేష్ టట్కర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవోలు, తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు