గణ నాథుని బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబు

31 Aug, 2019 12:50 IST|Sakshi

3న ధ్వజారోహణం 

అక్టోబర్‌ 22 వరకు  బ్రహ్మోత్సవాలు 

వివిధ వాహనాల్లో భక్తులను కటాక్షించనున్న స్వామివారు

భక్తుల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు

12 నుంచి ఉభయదారుల  ప్రత్యేక ఉత్సవాలు 

సాక్షి, కాణిపాకం(యాదమరి): సత్యప్రమాణాల దేవుడు..ప్రథమ పూజ్యడు అయిన శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబవుతోంది. సెప్టంబర్‌ 2వ తేదీ నుంచి 22వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా  నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారు  వివిధ వాహనాలలో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. స్వామివారి  దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా,  కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయనున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. ఆలయం, ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు.

ధ్వజారోహణం..
వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణంతో శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వామివారి వాహనమైన మూషికచిత్రపటాన్ని ధ్వజస్తంభానికి ఆరోహణ చేసి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాలు నిర్వఘంగా జరిగేలా దేవతలు ఆశీర్వదించేలా పూజలు చేస్తారు.

హంస వాహన సేవ..
మొదటి రోజు రాత్రి హంస వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. హంస వాహన సేవను తిలకిస్తే సద్గుణాలు అలవడుతాయని భక్తుల నమ్మకం. ఈ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున హజరవుతారు. 

మయూర వాహన సేవ..
రెండవ రోజు  మయూర(నెమలి) వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు.  మనిషిలో మంచిని గుర్తించేందుకు ఈ వాహన సేవను చూసి తరలించాలని  పురాణాలు చెబుతున్నాయి.

మూషిక వాహన  సేవ..
మూషికాశురుడిని స్వామి వారు వధించి, అతని కోరిక మేరకు మూషికాన్ని తన వాహనంగా చేసుకుంటారు. మూడోవ రోజు గణపయ్య మూషిక వాహనంపై దర్శనం ఇస్తారు. గర్వం తొలగిపోయేందుకు ఈ వాహన సేవను భక్తులు దర్శిస్తారు.

శేష వాహన సేవ..
నాగలోకానికి అధిపతి నాగరాజు. అలాంటి శేషుడ్ని వాహనంగా చేసుకొని వినాయకుడు  నాల్గువరోజు భక్తులకు దర్శనం ఇస్తారు. ఉత్సవాల్లో చిన్న, పెద్ద శేషవాహనాలపై స్వామివారు ఉదయం, రాత్రి వేళలో భక్తులకు దర్శనిమిస్తారు. 

వృషభ వాహన సేవ..
వృషభానికి అధిపతి శివుడు. ఐదో రోజు ఉత్సవంలో వినాయకుడు వృషభ వాహనంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన సేవను తిలకిస్తే స్వామి వారి కరుణా కటాక్షాలతో పాటు శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

రథోత్సవం..
ఏడో రోజున స్వామివారు భక్తులకు రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రథంపై విహరించే స్వామివారిని దర్శిస్తే సకల దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం.

గజవాహన సేవ..
ఏనుగు తలను తన శిరస్సుగా మార్చుకున్న స్వామివారు ఆరో రోజు గజవాహనంపై కరుణిస్తారు. ఈ గజ వాహన సేవను దర్శిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అశ్వవాహన సేవ..
మూషికాశురుని సంహారం తర్వాత బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధి, బుద్ధితో స్వామివారికి కల్యాణం జరుగుతుంది. అనంతరం స్వామి వారు స్వామివారు సిద్ధి,బుద్ధి సమేతంగా అశ్వవాహనంపై విహరిస్తు భక్తులకు దర్శనం ఇస్తారు. ఎనిమిదో రోజు అశ్వవాహన సేవ జరుగుతుంది. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం

ఏకాంత సేవ..
బ్రహ్మోత్సవాలు పూర్తిఅయిన తర్వాత ధ్వజావరోహణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత స్వామివారి మూల విగ్రహానికి పాయసం,  వడలతో అభిషేకం నిర్వహిస్తారు. దీనిని వడాయిత్తు ఉత్సవంగా అంటారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను నిర్వహిస్తారు. 

బ్రహ్మోత్సవాల వివరాలు..
-2వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఉదయం అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్లు, రాత్రి గ్రామోత్సవం.
-3వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం
-4వ తేదీ రాత్రి నెమలి వాహనం
-5వ తేదీ రాత్రి మూషిక వాహనం
-6వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి బంగారు పెద్ద శేషవాహనం
-7వ తేదీ ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనం
-8వ తేదీ  రాత్రి గజ వాహనం
-9వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం
-10వ తేదీ  ఉదయం భిక్షాండి, రాత్రి తిరుకళ్యాణం, అశ్వవాహనం
-11వ తేదీ  పగలు ధ్వజావరోహణం,  వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంత సేవ

ప్రత్యేక ఉత్సవాలు..
-12వ తేదీ  రాత్రి అధికార నంది వాహనం
-13వ తేదీ రాత్రి రావణబ్రహ్మ వాహనం
-14వ తేదీ రాత్రి సూర్యప్రభ వాహనం
-15వ తేదీ చంద్రప్రభ వాహనం
-16వ తేదీ రాత్రి యాళివాహనం
-17వ తేదీ  రాత్రి  విమానోత్సవము
-18వ తేదీ రాత్రి కల్పవృక్ష వాహనం
-19వ తేదీ రాత్రి పూలంగి సేవ
-20వ తేదీ రాత్రి కామధేను వాహనం
-21వ తేదీ  రాత్రి పుష్పపల్లకి సేవ
-22వ తేదీ  రాత్రి తెప్పోత్సవం

భక్తులకు విస్తృత ఏర్పాట్లు..
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వాగత ఆర్చీలు ఏర్పాటు చేశాం. రంగవల్లులు, విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాం. క్యూల ఆధునీకరణ, పుష్పాలంకరణ, అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాం.
–దేముళ్లు, ఈఓ కాణిపాం దేవస్థానం 

మరిన్ని వార్తలు