మిర్చి సాగు భళా

24 May, 2020 04:39 IST|Sakshi

ఈ ఖరీఫ్‌లో 28వేల హెక్టార్లలో అదనంగా సాగు అయ్యే అవకాశం

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరాకు ఏర్పాట్లు  

విత్తన ఎంపిక, శుద్ధి విషయాల్లో లాం సైంటిస్టు సూచనలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిర్చి సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన పంటలలో ఒకటైన మిర్చి వచ్చే ఖరీఫ్‌లో 28 వేల హెక్టార్లలో అదనంగా సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 1.22 లక్షల హెక్టార్లలో సాగు అవగా ఈ ఖరీఫ్‌లో 1.50 లక్షల హెక్టార్లలో అవుతుందని అంచనా. అంటే 28 వేల హెక్టార్లలో అదనంగా సాగు అయ్యే అవ కాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా విత్తన ప్రణాళిక ను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య వెల్ల డించారు. సుమారు 40 వేల కిలోల విత్తనాలు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భం గా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు.    

► నాణ్యమైన విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల వద్దనే కొనుగోలు చేయండి. విత్తనానికి భరోసా ఉంటుంది.
► అధీకృత డీలర్‌ నుంచి మాత్రమే విత్తనాలు, నమోదయిన నర్సరీల నుంచే నారు కొనుగోలు చేయాలి.
► విత్తనాలు, నారు లభ్యతపై ఏమైనా సమస్య లుంటే స్థానిక మండల వ్యవసాయాధికారిని సంప్రదించవచ్చు.
► నకిలీ విత్తనాన్ని అంటగట్టే ప్రమాదం ఉన్నందున అధిక డిమాండ్‌ ఉన్న హైబ్రీడ్‌ రకాలను ఎంచుకోవద్దు. 
► భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులను వాడాలి.
► కల్తీ, నకిలీ విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్న ట్టు దృష్టికి వస్తే సమీపంలోని వ్యవసాయా« దికారికి లేదా 1902కి ఫిర్యాదు చేయవచ్చు.  
► మిర్చి విత్తనాలకు విత్తన శుద్ధి చాలా అవస రం. పురుగు, తెగుళ్ల మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వైరస్‌ నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్‌తో విత్తన శుద్ధి చేయాలి. 

ఏఏ వంగడాలు అనువైనవంటే...
అనువైన రకాలు, విత్తన శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన వర్సిటీ లాం పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సి. శారద రైతులకు పలు సూచనలు చేశారు. 
► ఉద్యానవర్సిటీ నుంచి వెలువడిన జీ–3, జీ–4, జీ–5, సింధూర్, భాస్కర్, ఎల్‌సీఏ–334, ఎల్‌సీఏ–353 రకాలు అధిక దిగుబడులు ఇస్తాయి.
► సూటి రకాలలో ఎల్‌సీఏ–620, ఎల్‌సీఏ 625, సంకర రకాలలో ఎల్‌సీహెచ్‌–111,  పాప్రికా రకాలలో ఎల్‌సీఏ 424, ఎల్‌సీఏ 436 ఉన్నాయి. 
► ఎల్‌సీఏ–620 రకం 170 నుంచి 190 రోజుల్లో దిగుబడి వస్తుంది. హెక్టార్‌కు 65 నుంచి 68 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది.  
► పలు ప్రైవేటు సంస్థలు కూడా వివిధ రకాల సూటి, సంకర రకాలను విడుదల చేస్తున్నాయి. ఇండాయ్‌–5, తేజస్వినీ, యూఎస్‌–341, దేవనూర్‌ డీలక్స్, గోల్డ్‌–50, బీఎస్‌ఎస్‌–355, బీఎస్‌ఎస్‌–273, హెచ్‌పీహెచ్‌ 5531, ఎస్‌4884, ఎస్‌–5531 ముఖ్యమైనవి.

మరిన్ని వార్తలు