స్వాతంత్య్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

24 Jul, 2018 12:25 IST|Sakshi
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ధనంజయరెడ్డి  

కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : రాష్ట్ర స్వాతంత్య్ర దినో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి అధికారులకు ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో త్వరితగతిన పనులు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరాములునాయుడును ఆదేశించారు. మొక్కలు కడియం నుంచి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్‌ కమిషనర్‌ కలెక్టర్‌కు వివరించారు.

వీఐపీల సిటింగ్, పార్కింగ్‌ తదితర వాటిపై కలెక్టర్‌కు ఆయన వివరించారు. మైదానంలో పేరెడ్‌ వద్ద రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. డయాస్‌ ఏర్పాట్లుకు ఏజెన్సీని గుర్తించాలని, వాటర్‌ ప్రూఫ్‌ టెంట్స్‌ ఉండాలన్నారు.

ఎన్‌సీసీ కేడెట్లు 500 మంది వస్తారని, వారికి వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ చెప్పగా, వారికి పెద్దపాడు, సింగుపురం రోడ్డు మార్గంలో ఒక కళాశాల ఉందని శ్రీకాకుళం తహసీల్దార్‌ మురళీకృష్ణ అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను శకటాలలో చూపించేందుకు 12 చక్రాలు గల 12 వాహనాలు ఉండాలని ఉప రవాణా కమిషనర్‌కు ఆదేశించారు. వాహనాలను ముందుగా పరిశీలించి ఏర్పాట్లు చేయాలన్నారు.

ఒకసారి ట్రైల్‌ కూడా వేయాలన్నారు. శానిటేషన్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లును మున్సిపల్‌ కమిషనర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఈలు చూసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన జాతీయ గీతం, రాష్ట్రానికి సంబంధించిన గీతం, శ్రీకాకుళం జిల్లాకు సంబం ధించిన గీతాలు ఉండాలని డీపీఆర్‌వో ఎల్‌.రమేష్‌కు ఆదేశించారు.

వచ్చే అతిథులకు, అధికారులకు వసతిపై చర్చించారు. వివిధ శాఖ అధికారులను, కమిటీలుగా నియమించాలని జాయింట్‌ కలెక్టర్‌–2 రజనీకాంతరావును ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు, జిల్లా ఏఎస్పీ టి.పనసారెడ్డి డీఆర్‌వో కె.నాగేంద్రబాబు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్ట ర్‌ జి.సి.కిషోర్‌కుమార్, జెడ్పీ సీఈవో బి.నగేష్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్‌డీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు