డెక్కన్ క్రానికల్ చైర్మన్ అరెస్టుకు రంగం సిద్ధం

18 Jul, 2013 04:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) చైర్మన్, డెరైక్టర్లను అరెస్టు చేయడానికి చండీగఢ్ నుంచి పోలీసు బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ కేసులో అక్కడి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో చండీగఢ్‌కు చెందిన ఎస్సై లఖ్వీర్‌సింగ్ నేతృత్వంలో  ఐదుగురు సభ్యుల బృందం బుధవారం సాయంత్రం చేరుకొంది. రెలిగర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ నుంచి డీసీహెచ్‌ఎల్ కంపెనీ గత ఏడాది రూ. 100 కోట్ల రుణం తీసుకుంది.
 
 అందులో  వడ్డీ రూ. 5.14 కోట్లతో కలిపి మొత్తం బకాయి రూ. 62.23 కోట్లు అయింది. ఇందులో రూ. 6 కోట్లు చెల్లించేందుకు గత ఏడాది జూలై 1న రెండు చెక్కులు, ఆగస్టు 1న మరో రెండు చెక్కులు డీసీహెచ్‌ఎల్ నిర్వాహకులు రెలిగర్ సంస్థకు ఇచ్చారు. అవి బౌన్స్ అవడంతో రెలిగర్ సంస్థ చండీగఢ్‌లోని ఆర్థిక నేరాల నియంత్రణ విభాగానికి  మే నెలలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీసీహెచ్‌ఎల్ చైర్మన్ తిక్కవరపు వెంకటరామిరెడ్డి, వైస్‌చైర్మన్ టి. వినాయక్ రవిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ పి.కె.అయ్యర్, డెరైక్టర్లు, కొందరు ఆడిటర్లపై కేసు నమోదు చేశారు. రెలిగర్ నుంచి రుణం తీసుకునేందుకు సెక్యూరిటీగా చూపిన ఆస్తులకు సంబంధించిన ధ్రువపత్రాలు నకిలీవని ప్రాథమిక విచారణలో బయటపడింది. దీంతో చెక్ బౌన్స్‌కు సంబంధించి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఆర్థ్ధిక నేరాల నిరోధక విభాగం పోలీసులు చండీగఢ్ కోర్టును కోరారు. ఈమేరకు అక్కడి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌లను జారీ చేసింది. వాటి ఆధారంగా డెక్కన్ క్రానికల్ నిర్వాహకులను అరెస్టు చేసేం దుకు చండీగఢ్ పోలీసులు వచ్చారు. అయితే, డీసీహెచ్‌ఎల్ చైర్మన్ వెంకటరామిరెడ్డి వ్యాపార కారణాలతో విదేశాలకు వెళ్లినట్లు కంపెనీ వర్గాలు చండీగఢ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆస్తుల నకిలీ ధ్రువపత్రాలతో కెనరా బ్యాంక్ నుంచి రుణం పొందిన వ్యవహారంపై డెక్కన్ క్రానికల్ నిర్వాహకులపై సీబీఐ అధికారులు ఈనెల 9న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోపక్క.. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కూడా డీసీహెచ్‌ఎల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
 
 గతంలో వచ్చిన ఇద్దరు పోలీసుల సస్పెన్షన్: చెక్ బౌన్స్ కేసులో డెక్కన్ క్రానికల్ నిర్వాహకులను అరెస్టు చేసేందుకు రెండు నెలల క్రితం  చండీగఢ్ నుంచి వచ్చిన ఇద్దరు  పోలీసులు నిందితుల నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. రెలిగర్ సంస్థ ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసు ఉన్నతాధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా