అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు

18 Jul, 2014 04:35 IST|Sakshi
అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు

- ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు చోరీ
- గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 22 దొంగతనాలు
- మొత్తం రూ.4.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

చిలకలూరిపేట రూరల్ (గుంటూరు) : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైరు దొంగిలిస్తుంటారు. నిందితుల వద్ద నుంచి రూ.3,55,225 విలువైన రాగివైరు, రూ.75,000 విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు కలిపి మొత్తం రూ.4,30,225 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు రూరల్ ఆపరేషన్స్ ఓఎస్డీ, నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ కె.సి.వెంకటయ్య ఆ వివరాలు వెల్లడించారు.

ఎత్తిపోతల పథకాలకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులకొట్టి రాగివైరును దొంగిలించిన ఐదు కేసులపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జాతీయరహదారి సమీపంలోని గొర్రెలమండి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ఎస్సై జగదీష్ విచారించారు. ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైరు అపహరించే ముఠాగా గుర్తించి అరెస్టు చేశారు.
 
ప్రకాశం జిల్లా కొరిశపాడు గ్రామానికి చెందిన పొత్తూరు లక్ష్మీనారాయణ అలియాస్ ఎఫ్రా నాయకుడిగా తన సమీప బంధువులైన పొత్తూరు కిషోర్, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన పొత్తూరు వెంకటనారాయణ, గుంటూరు సంగడిగుంటకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ రహీమ్‌తో కలిసి గతేడాది డిసెంబర్ నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠానాయకుడు చిలకలూరిపేట పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో 2001లో జరిగిన దొంగతనం కేసులో నిందితునిగా ఉన్నాడు. గ్రామాలకు దూరంగా ఎత్తిపోతల పథకాల వద్ద, మూతపడిన పరిశ్రమల్లో ఉండే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులో ఉండే రాగివైరును వీరు అపహరిస్తుంటారు.

వివిధ కంపెనీల్లో కంప్యూటర్లు కూడా చోరీ చేశారు. నిందితులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 11 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 33 గ్రామాల్లో 22 దొంగతనాలు చేశారు. వీటికి సంబంధించి చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 5, యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో 1, ఫిరంగిపురం 3, దాచేపల్లి 1, గుంటూరు రూరల్ 2, నకరికల్లు 2, బండ్లమోటు 2, పెదనందిపాడు 1, ఈపూరు 2, ప్రకాశం జిల్లా ముండ్లమూరు 2, అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఓఎస్‌డీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ టి.సంజీవ్‌కుమార్, ఎస్సై ఎస్.జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.
 
పోలీసు సిబ్బందికి ఓఎస్‌డీ అభినందనలు..
 రెండు జిల్లాల్లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులను విచారించి చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఓఎస్‌డీ వెంకటయ్య అభినందించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సంజీవ్‌కుమార్, ఎస్సై జగదీష్‌లను అభినందించడంతోపాటు.. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎన్.ఇర్మియ, బాషా, హోంగార్డు మధు, డ్రైవర్ ఎ.రామ్‌లాల్‌నాయక్‌లకు రూ.500 చొప్పున నగదు బహుమతి అందించారు.
 

మరిన్ని వార్తలు