స్తంభించిన రిజిస్ట్రేషన్లు

2 Jun, 2014 01:08 IST|Sakshi
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
  • నేటితో రెండుగా విడిపోతున్న శాఖ
  •  రెండు రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు
  •  రాజధాని అంచనాలతో ‘రియల్’ బూమ్
  •  జిల్లాలో ఊపందు కోనున్న క్రయవిక్రయాలు
  •  కైకలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడివిడిగా సర్వీసు సర్వర్లు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు రోజులుగా ఆయా మండలాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, ఈసీల కోసం ప్రజలు అవస్థలు పడ్డారు.

    జిల్లాలో మొత్తం 50 మండలాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. హైదరాబాదు కేంద్రంగా సర్వర్ పనిచేస్తోంది. జూన్ 2న రాష్ట్రం రెండుగా విభజన జరగనుండటంతో నూతనంగా ఏర్పడే ఇరు రాష్ట్రాలకు కొత్త సర్వీసు సర్వర్లు సోమవారం నుంచి విడివిడిగా ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
     
    రెండుగా విడిపోనున్న సిబ్బంది...
     
    విభజన నేపథ్యంలో ఇప్పటి వరకు హైదరాబాదు ప్రధాన కేంద్రంగా జరిగిన రిజిస్ట్రేషన్ సేవలు రెండుగా విడిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు సర్వర్లు రానున్నాయి. శాఖాపరమైన విధులు, సిబ్బంది విషయానికి వస్తే సెంట్రల్ సీ అండ్ ఐజీ ఆఫీస్, జోనల్ ఆఫీస్ అనే రెండంచెల విధానంలో రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ పనిచేస్తుంది.

    రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఐజీ, అడిషనల్ కమిషనర్ ఐజీ, జాయింట్ ఐజీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1,  సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, సీనియర్ అసిస్టెంట్స్, టైపిస్టు, షరాఫ్, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినెంట్లు కలిపి 3,997 మంది ఈ శాఖలో పనిచేస్తున్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయాన్ని రెండుగా విభజించి పదేళ్ల పాటు అదే కార్యాలయాల్లో విడివిడిగా విధులు నిర్వహించనున్నారు. సెంట్రల్ కార్యాలయంలో సిబ్బందిని ఆయా ప్రాంతాల ప్రాతిపాదికన బదలాయిస్తున్నారని, జోనల్ వ్యవస్థలో ప్రాంతాలవారీ బదిలీలపై స్పష్టమైన ఆదేశాలు రాలేదని కార్యాలయ సిబ్బంది ఒకరు తెలిపారు.
     
    స్టాంపు డ్యూటీపై గంపెడాశలు...
     
    అవశేష ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కారణంగా జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వస్తాయని, ఈ పరిణామం స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కలిసొచ్చే అంశంగా మారుతుందని జిల్లా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడల మధ్య ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ముందుకు దూసుకుపోతుందని, రాజధాని ప్రభావం కారణంగా క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని అందరూ భావిస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు