నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు

16 Sep, 2014 02:40 IST|Sakshi
నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు

పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలో నకిలీ మద్యం తయారీ ముఠాను గంగవరం పోలీసులు పట్టుకున్నారు. దండపల్లె సమీపంలో గల జోగిండ్లు వద్ద ఓ కోళ్లఫారమ్‌లో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశారు. రూ.8 లక్షల విలువజేసే నకిలీ మద్యం, తయారీ వస్తువులు, ఖాళీ బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్ములు, ఓ కారును సీజ్ చేశారు. ప్రధానమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
 
ఎలా పట్టుబడ్డారంటే..
పెద్దపంజాణి పోలీసులు ఆదివారం రాత్రి బట్టందొడ్డి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో నాలుగు కేసుల మద్యం కంటపడింది. ఆరా తీయగా అది నకిలీ మద్యమని తేలింది. కారులోని ఓ వ్యక్తి పరారుకాగా బద్రీ అనే వ్యక్తి చిక్కాడు. మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు బద్రీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన గంగవరం సీఐ రామకృష్ణ తన సిబ్బందితో కలసి గంగవరం మండలంలోని దండపల్లె సమీపంలో గల జోగిండ్లు కోళ్లఫారమ్‌లో తయారవుతున్న నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. సోమవారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
68 కేసుల మద్యం, తయారీ పరికరాలు సీజ్..
ఈ కోళ్లఫారమ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 68 కేసుల (3264 క్వార్టర్ బాటిళ్ల) మద్యం పట్టుకున్నారు. ఆరుబస్తాల్లో నిల్వ ఉన్న ఖాళీ క్వార్టర్ బాటిల్ సీసాలు, కార్క్‌లు (బిరడాలు), మద్యం తయారీకి వినియోగించే డ్రమ్ము, 35 లీటర్ల ఖాళీ క్యాన్లు 8, లేబుళ్లు (హైవార్డ్స్, ఓల్డ్‌టావెర్న్)లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం త యారీకి ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, బ్రాందీ, విస్కీ ఎసెన్స్‌లు, ఎక్సైజ్ శాఖకు చెందిన నకిలీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ దొరికాయి. వీటిని స్టేషన్‌కు తరలించారు.
 
ఎలా తయారు చేస్తున్నారంటే..
గంగవరానికి చెందిన బద్రీ ఆరు నెలల క్రితం జోగిండ్లుకు చెందిన జయమ్మ కోళ్లఫారాన్ని లీజుకు తీసుకున్నాడు. అందులో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన రమేష్‌కుమార్‌తో పాటు కోలార్ ప్రాంతానికి చెందిన ఓ బ్యాచ్ దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారు చేసినా మద్యాన్ని స్థానికంగానే కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
 
నెల క్రితం వచ్చిన కొత్త హోలోగ్రాఫిక్ లేబుల్స్‌తోనే..
గత నెల ఒకటో తేదీ ఎక్సైజ్ శాఖ కొత్త హోలోగ్రాఫిక్ లేబుల్స్‌తో మద్యం దుకాణాలకు సరుకును సప్లై చేసింది. ఆ హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఇక్కడ దొరికిన నకిలీ మద్యంపై కనిపించాయి. నెల రోజుల వ్యవధిలోనే నకిలీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేస్తున్నారు. గంగవరం, పలమనేరు పరిధిలోని మద్యం దుకాణాల్లో సైతం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వాసుదేవచౌదరి తన సిబ్బందితో హోలోగ్రాఫిక్ లేబుల్క్‌ను తనిఖీ చేయడం గమనార్హం. స్థానిక ఎక్సైజ్ సీఐ నాగభూషణం సైతం కూపీ లాగే పనిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు