ఏం పాపం చేశారని...

28 May, 2016 00:29 IST|Sakshi
ఏం పాపం చేశారని...

ఏఆర్‌టీ కేంద్రాల్లో వారం క్రితమే అయిపోయిన పిల్లల మందులు
పట్టించుకోని అధికారులు
ఆస్పత్రులకు వచ్చి తిరిగెళుతున్న బాధితులు

 
క్షణకావేశంలోనో..మరేదైనా కారణంతోనో ఎయిడ్స్ వ్యాధికి గురైన వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకుని..వారి జీవితాలకు కొండంత భరోసా ఇవ్వాలి. కానీ  ప్రభుత్వ తీరు చూస్తే అండగా ఉండడం దేవుడెరుగు కనీసం నెలవారీ మందులు కూడా అందివ్వడం లేదు. ఏఆర్‌టీ సెంటర్‌లో వారం క్రితం పిల్లలకిచ్చే మందులు అయిపోయినా పట్టించుకున్న నాథుడు లేదు. మందుల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు మందులు లేక వట్టి చేతులతో..ఆరోగ్యంపై కొండంత దిగులుతో వెనుదిరుగుతున్నారు.  
 
 
విజయవాడ(లబ్బీపేట): జిల్లాలోని విజయవాడ కొత్త, పాత ఆస్పత్రులతో పాటు, మచిలీపట్నం, గుడివాడల్లో ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ బాధితులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సుమారు 40 వేల మంది వరకూ ెహ చ్‌ఐవీ బాధితులు రిజిస్ట్రేషన్ కాగా, వారిలో 18 వేల మంది మందులు వాడుతున్నారు. మందులు వాడుతున్న వారిలో వెయ్యి మంది వరకూ చిన్నారులు ఉన్నారు. వారికి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించి నాలుగు రకాల మందులు ఇవ్వాలి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో పిల్లలకిచ్చే బీఎల్‌ఎన్ బేబీతోపాటు, మరో రకం మందులు వారం క్రితమే అయిపోయాయి. మందుల కోసం వచ్చిన వారికి అందుబాటులో ఉన్న రెండు రకాల మందులే ఇచ్చి పంపించేస్తున్నారు. దీంతో పిల్లలు అనారోగ్యానికి గురైతే ఎవరు బాధ్యుతలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.  
తరచూ ఇవే ఇబ్బందులు
ఏఆర్‌టీ కేంద్రాలు నగరంలో పదేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇవి 2014 వరకూ బాగానే నడిచాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సాక్స్‌లో కిట్‌లు, మందులు కొనుగోలుకు సంబంధించి తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో తరచూ ఏఆర్‌పీ కేంద్రాల్లో మందుల కొరత వస్తోంది. ఇటీవల పెద్దలకు ఇచ్చే మందులు కొరత నెలకొనగా, తాజాగా చిన్నారులకు ఇచ్చే మందులు అయిపోయాయి.


 దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం
హెచ్‌ఐవీ బాధితులు మందులు మధ్యలో మానే స్తే దుష్ఫలితాలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అలాంటిది హెచ్‌ఐవీ సోకిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మందులు నిలిపివేయడం ద్వారా వ్యాధులు సోకే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 
 మందుల కొరత నా దృష్టికి రాలేదు
 ఏఆర్‌టీ కేంద్రాల్లో మందులు కొరత ఉన్నట్లు నా దృష్టికి రాలేదు. రాష్ట్రంలో మందులు షార్టేజ్ ఏమీ లేదు, ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్స్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటా. - డాక్టర్ టీవీఎస్‌ఎన్ శాస్త్రి, జిల్లా ఎయిడ్స్ నోడల్ ఆఫీసర్
 

>
మరిన్ని వార్తలు