నడిపించే దాతృత్వం

16 Nov, 2018 08:09 IST|Sakshi

దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు సమకూర్చేందుకు సంకల్పం

రాజస్థానీ సంఘాల మహత్తర కార్యక్రమం

రేపు కొత్త నడక మొదలెట్టనున్న 472 మంది

వారు ఈ ప్రాంతీయులు కారు.. ఎక్కడో సుదూరాన ఉన్న రాజస్థాన్‌ నుంచి దశాబ్దాల క్రితం తరలివచ్చి పలు వ్యాపకాలతో ఉపాధి పొందుతూ ఇక్కడే స్థిరపడ్డారు. తమకు ఆదరువు కల్పించిన ఈ ప్రాంతానికి, ఇక్కడి వారికి ఏదో చేయాలన్న తపనతో రాజస్థానీ అగర్వాల్‌ సమ్మేళన్, రాజస్థానీ సాంస్కృతిక మండళ్ల పేరిటి ఏకతాటిపైకి వచ్చి సమాజ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి దాతృత్వం అక్కడితో ఆగిపోలేదు.. విశాఖ, విజయనగరం, శ్రీకాకాళం జిల్లాలకు నడిచెళ్లింది. ప్రమాదాలు ఇతర కారణాలతో కాళ్లు కోల్పోయి..నడక మర్చిపోయిన వారికి మళ్లీ నడక నేర్పాలని సంకల్పించారు. అటువంటి దీనులకు కృత్రిమ కాళ్లు సమకూర్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హులను ఎంపిక చేశారు. కొలతలు తీసుకున్నారు. తొలి విడతలో శనివారం 472 మందికి కృత్రిమ కాళ్లు అమర్చేందుకు సర్వం సిద్ధం చేశారు.

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయి సంవత్సరాల తరబడి అవస్థల జీవనం సాగించిన వారికి కృత్రిమ అవయవాలను అందించేందుకు ముందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్‌ అఖిల భారత అగర్వాల్‌ సమ్మేళన్, రాజస్థాన్‌ సాంస్కృతిక మండలి. తమ పనులు తాము స్వయంగా చేసుకోలేక ఇతరులపై ఆధారపడిన వారు ఇక స్వతంత్ర జీవనం సాగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దివ్యాంగులు కొత్తపథంలో అడుగిడేందుకు ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్, మహా విశాఖ నగరపాలక సంస్థ, ప్రేమ ఆస్పత్రి, రాష్ట్ర దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహకారం అందిస్తున్నాయి.

తయారీలో నిపుణులు నిమగ్నం
కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ వంటి పరికరాల తయారీలో 35 ఏళ్ల ఆనుభవం ఉన్న కోల్‌కతాకు చెందిన మహావీర్‌ సేవాసదన్‌కు చెందిన 16 మంది నిపుణులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. మహారాణిపేటలోని రాజస్థాన్‌ సాంస్కృతిక భవన్‌లో ఈ నెల 10 నుంచి కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 528 మంది లబ్ధిదారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకుని, తమకు అవసరమైన అవయవాల కొలతలను ఇచ్చారు. వాటి ప్రకారం అవయవాలను తయారు చేసి, ఈ నెల 17న విశాఖపట్నం రాజస్థాన్‌ సాంస్కృతిక భవనంలోను, 22న శ్రీకాకుళంలోను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఒక్కో కృత్రిమ కాలుకు రూ.2 నుంచి రూ.4వేల వరకు, కృత్రిమ చేతికి రూ.6వేల వరకూ వెచ్చిస్తున్నారు. అలా ఒకటా.. రెండా దాదాపు 28లక్షల రూపాయలను అగర్వాల్‌ సమ్మేళన్, రాజస్థాన్‌ సాంస్కృతిక మండలి సమకూర్చాయి. 2015 ఏప్రిల్‌ 19వ తేదీన నిర్వహించిన శిబిరంలో 200 మందికి కృత్రిమ, కాళ్లు చేతులను అమర్చే కార్యక్రమం విజయవంతం అయ్యింది. కృత్రిమ అవయవాల కొరకు వచ్చే లబ్ధిదారులకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు వసతి సౌకర్యం కూడా నిర్వాహకులు కల్పించారు.

కాలేజీకి అందరిలానడిచి వెళ్లగలను
చిన్నతనంలో వచ్చిన పోలియో వల్ల కాలు కురచగా మారిపోయింది. 2015లో ఇప్పటి నిర్వాహకులే కృత్రిమ కాలు అమర్చారు. వయసు పెరగడంతో కాలు సైజు కూడా మారింది. దీంతో మళ్లీ వీళ్లే మరో కృత్రిమ కాలును అమర్చుతున్నారు. కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండేది. కొత్తకాలు అమరికతో ఇబ్బంది తొలగిపోనుంది.   – దినేష్‌కుమార్, గాజువాక

మరిన్ని వార్తలు