విలీనానికి వ్యతిరేకం

21 Dec, 2013 02:09 IST|Sakshi

=స్పష్టం చేసిన ప్రజానీకం
 =‘గ్రేటర్’లో గ్రామాలు కలపొద్దని డిమాండ్
 =ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

 
అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్ : అనకాపల్లి పరిధిలో గల పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయడానికి సంబంధించి శుక్రవారం  గ్రామాల్లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు రసాభాసగా మారాయి. గ్రామస్తులు ఈ సభలలో అధిక సంఖ్యలో పాల్గొని, గ్రేటర్‌లో విలీనం చేయొద్దని ఎలుగెత్తి చాటారు.  అనకాపల్లి మున్సిపాలిటీని ఇది వరకే  గ్రేటర్ విశాఖలో విలీనం చేయడంతో మండలానికి చెందిన మూడు పంచాయతీలు గ్రేటర్‌లో కలసిపోయాయి. అయితే అప్పట్లో ఆయా పంచాయతీలకు చెందిన ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే విలీనం చేయడంతో గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.

విలీనం చేసిన సుమారు మూడు నెలల తర్వాత  ఎట్టకేలకు అధికారులు స్పందించి శుక్రవారం కొప్పాక, వల్లూరు, రాజుపాలెం  గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించారు. ఆ మూడు గ్రామాల ప్రత్యేకాధికారి పి.అచ్యుతరావు ఆధ్వర్యంలో వీటిని చేపట్టారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎలా విలీనం చేశారంటూ అక్కడికి వచ్చిన అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. గ్రేటర్‌లో విలీనం చేయొద్దంటూ పట్టుబట్టారు. దీంతో అధికారులు, గ్రా మస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

గ్రామసభ రసాభాసగా మా రింది. జీవీఎంసీలో విలీనం వల్ల పన్నుల భారం పెరుగుతుందని, కూలీలు ఉపాధి హామీ పథకానికి నోచుకోరని గ్రామస్తులు చెప్పారు. వెయ్యి మందికి పైగా ప్రజలు ఉపాధి కోల్పోతారన్నారు. అనేక సమస్యలు ఎదురవుతాయని, అందుకే జీవీఎంసీలో విలీనానికి తాము వ్యతిరేకమని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేకాధికారి అచ్యుతరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించామని తెలిపారు.

ప్రజల అభిప్రాయాలను నేరుగా అధికారులకు నివేదిస్తామని చెప్పారు. తమ గ్రామాలకు జీవీఎంసీలో విలీనం చేయొద్దంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు తీర్మాన పత్రాన్ని అందజేశారు.  రాజుపాలెం గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ  సేకరణ సభలో మాత్రం కొందరు విలీనాన్ని వ్యతిరేకించగా, మరికొందరు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఆర్.ఎల్.ఎన్.కుమార్, పంచాయతీ కార్యదర్శి దుర్గా ప్రసాద్, వల్లూరు పంచాయతీ మాజీ  సర్పంచ్ వై.వి.సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ  నాయకుడు సిమ్మా ముసిలినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎం.గోపాలరావు, వి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు