నిర్లక్ష్యంపై కొరడా..'

5 Sep, 2013 03:42 IST|Sakshi

జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ :  ఇందిరమ్మ పథకంలో భాగంగా లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శిస్తూ, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరఢా ఝులిపించింది. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించడంలో డివిజన్ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అలసత్వంగా వ్యవహరిస్తున్న వారికి గతంలో హెచ్చరికలు జారీ చేసి 49మంది అధికారుల ప్రయాణ భత్యానికి కోతపెట్టారు. ఇది జరిగి రెండు నెలలు గడిచినా అధికారుల్లో ఏమాత్రం పురోగతి కనిపించలేదు. దీంతో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆ శాఖ పీడీ నరసింహారావు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు నివేదిక సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ మూడు రోజుల క్రితం 102 మంది సిబ్బందికి మెమోలు జారీ చేయగా.. బుధవారం మంథని డివిజన్‌లో మరో ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 జిల్లాలో 2005 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వివిధ దశల్లో 2.61లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, 1.55 లక్షల ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు ఆరోపణలున్నాయి. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా చోట్ల లబ్ధిదారులకు బిల్లులందక కార్యాలయాల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పలువురు ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తున్నారు.
 
 సోమవారం 102 మంది అధికారులకు మెమోలతో వార్నింగ్ ఇవ్వగా..బుధవారం మంథని డివిజన్‌లోని మహముత్తారం మండలం ఏఈ భాస్కర్‌ను రివర్షన్ చేశారు. మంథనిలో ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లకు మెమోలు జారీ చేయగా, మరో వర్క్ ఇన్‌స్పెక్టర్ డి. శంకర్‌ను గృహనిర్మాణ శాఖకు సరెండర్ చేశారు. అలాగే, అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను పీడీ ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఏర్పడిన సమస్యలను జిల్లా అధికారులకు సమాచారమివ్వకుండా నాగరాజు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం వల్లే చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.
 
 మున్ముందు మరిన్ని చర్యలు..
 -పీడీ నర్సింహరావు
 టార్గెట్ పూర్తి చేయని అధికారులపై మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటాం. తొలి దఫా చర్యగా మెమోలు జారీ చేశామని..ఇక నుండి ఇంటి నిర్మాణాల్లో ప్రగతి కనిపించకుంటే కఠిన చర్యలు తప్పవు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాల విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందిస్తే నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది.  డివిజన్, మండల స్థాయి అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు