రంగంలోకి టీడీపీ అధిష్టానం.. జేసీతో మంతనాలు

16 Jun, 2017 11:43 IST|Sakshi
రంగంలోకి టీడీపీ అధిష్టానం.. జేసీతో మంతనాలు

విశాఖపట్నం: జాతీయ స్థాయిలో టీడీపీ పరువు పోయేలా వ్యవహరించిన ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వివాదంపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ వివాదం వేడి తాకింది. గూండాలాగా వ్యవహరించిన ఓ ఎంపీ విషయంలో చంద్రబాబు ఇలాంటి వైఖరేనే అనుసరించేది.. అండదండలు అందించేది అని ఆగ్రహం పెల్లుబుకుతుండటంతో నష్టనివారణ చర్యలకు పార్టీ దిగింది. ఇప్పటికే జేసీతో మరో ఎంపీ సీఎం రమేశ్‌ మంతనాలు జరుపుతున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేసును మరోదారిలో నీరుగార్చేందుకు టీడీపీ యత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది కూడా జేసీపై ఫిర్యాదు కూడా చేయలేదు. సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారు. దీంతో జేసీని రక్షించేందుకు కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీ గైక్వాడ్‌ విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన జేసీ దాడి విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అనుసరిస్తున్నారు. దీంతో సొంతపార్టీ ఎంపీకి ఒక న్యాయం, ఇతర ఎంపీలకు మరో న్యాయమా అంటూ తీవ్ర విమర్శలు ఆయనపై వస్తున్నాయి.