ఏసీబీ వలలో ఏఎస్సై

19 Jan, 2019 07:50 IST|Sakshi
లంచం తీసుకుంటూ దొరికిపోయిన దేవరపల్లి ఏఎస్సై సత్యనారాయణ

పశ్చిమగోదావరి, దేవరపల్లి: దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై పి.సత్యనారాయణ ఏసీబీ వలలో చిక్కారు. మండలంలోని దుద్దుకూరుకు చెందిన మహిళ వద్ద నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘దుద్దుకూరుకు చెందిన ఎం.నాగమణి అనే మహిళ నెలరోజుల క్రితం ఒక వ్యక్తి తనను తిట్టి కొట్టడానికి వచ్చాడని ఏఎసైకి ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదుకు కాగితాల ఖర్చు నిమిత్తం రూ.వెయ్యి చొప్పున రెండుసార్లు, మరోసారి రూ.2 వేలు లంచంగా ఇచ్చింది. దీంతో సంతృప్తి చెందని ఏఎస్సై ఉన్నతాధికారుల పేరుతో మరింత సొమ్ము డిమాండ్‌ చేయడంతో నాగమణి ఏసీబీ అధికారులు ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏఎస్సైని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. నాగమణి కూలిపని చేసుకుని జీవివనోపాధి సాగిస్తోంది. గతంలో ఆమె కుమార్తె కేసు ఒకటి కోర్టులో నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వ్యక్తి నాగమణిని తిట్టడం, కొట్టడానికి రావడంతో ఫిర్యాదు చేసిందని’ వివరించారు. రైటర్‌గా పనిచేస్తోన్న సత్యనారాయణకు ఇటీవల ఏఎస్సైగా పదోన్నత లభించిందని, ఆయన్ని రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని గోపాలకృష్ణ వివరించారు.

అవినీతి అధికారుల బెంబేలు
అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులతో అవినీతి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో దేవరపల్లి మండలంలో ఇద్దరు అవినీతి అధికారులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని అవినీతి అధికారులు హడలిపోతున్నారు. డిసెంబర్‌ 21న దేవరపల్లి తహసీల్దార్‌ కార్యాయంలో రైతు నుంచి బోరు సర్టిఫికెట్‌కు వీఆర్వో రూ.15 వేలు లంచం తీసుకొంటుండగా పట్టుబడ్డారు. తాజాగా ఏఎస్సై సత్యనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇటీవల చిన్నాయగూడెంలో జరిగిన జన్మభూమి సభలో అవినీతి అధికారులపై రైతులు జన్మభూమి అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బోరు సర్టిఫికెట్‌కు రూ.15 వేలు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలకు రూ.10 వేలు డిమాండ్‌ చేస్తున్నారని, ఇవ్వకపోతే నెలల తరబడి తిప్పుతున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో సభను దాదాపు గంట సేపు స్తంభించింది. సుమారు పదేళ్ల క్రితం దేవరపల్లి స్టేషన్‌ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కినట్టు చిక్కి ఇంటి నుంచి పారిపోయిన విషయం విదితమే.

నెల రోజులుగా తిరుగుతున్నా
బాధితురాలు నాగమణి మాట్లాడుతూ నెలరోజులుగా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, ప్రత్యర్థుల మాటవిని తనకు అన్యాయం చేయడంతో విసుగు చెందానని తెలిపంది. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పింది.

మరిన్ని వార్తలు