ఆశల పల్లకిలో

11 Mar, 2018 15:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర మంత్రి పదవి రేసులో గోకరాజు

పైడికొండలకు కేంద్ర కార్పొరేషన్‌ పదవి?

మంత్రివర్గంలో స్థానం కోసం టీడీపీ ఎమ్మెల్యేల ప్రయత్నాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ఆ స్థానంలో జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు పలువురు మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించారు.

రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడంతో ఆ రెండు పదవులను రాష్ట్రానికి చెందిన వారితోనే భర్తీ చేస్తారనే ప్రచారం బీజేపీలో సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కంభంపాటి హరిబాబుతో పాటు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనాయకత్వంతో ఉన్న సత్సంబంధాల కారణంగా గోకరాజు గంగరాజుకు పదవి దక్కుతుందని తెలుస్తోంది. అయితే వెంటనే ఆ పదవులను భర్తీ చేస్తారా ఇంకా సమయం తీసుకుంటారా అన్నది వేచిచూడాల్సి ఉంది. మరోవైపు మంత్రి పదవికి రాజీనామా చేసిన పైడికొండల మాణిక్యాలరావుకు కేంద్రానికి చెందిన ఒక కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం కనపడుతోంది.

రాష్ట్రంలో కూడా రెండు పదవులు ఖాళీ కావడంతో ఆ పదవుల్లో ఒకటి జిల్లాకు కేటాయించవచ్చన్న ప్రచారం మొదలైంది. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం రాజ్యసభ ఎన్నికల తాయిలంగా ఈ పదవులను వాడుతున్నట్లు సమాచారం. రాజ్యసభలో మూడో సీటు దక్కించుకోవడం కోసం కొత్తగా తమ పార్టీలోకి వచ్చే వారికి ఈ పదవులను ఎరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్ల కొంత డైలమా నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏలో కొనసాగుతామని చెప్పడం స్వార్ధపూరిత రాజకీయలబ్ధి కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస వర్మ బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల కోసమే తెలుగుదేశం ఎన్‌డీఏలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పథకంలో దేశంలో 10 లక్షల గృహాలను మంజూరు చేస్తే ఒక్క ఏపీలో 6.5 లక్షల గృహాలు ఇచ్చారని, ఇవన్నీ తాము చెప్పుకోలేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ నేడు విమర్శలకు దిగుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, పెంచిన పింఛన్లు రాష్ట్ర లోటు బడ్జెట్‌లో చూపిస్తే కేంద్రం ఎందుకు ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా మిత్రభేదంతో జిల్లాలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. 

మరిన్ని వార్తలు