అసెంబ్లీ నిరవధిక వాయిదా

31 Jul, 2019 03:48 IST|Sakshi

14 రోజులపాటు కొనసాగిన బడ్జెట్‌ సమావేశాలు

78 గంటల 35 నిమిషాలపాటు చర్చ

19 బిల్లులకు ఆమోదం

ప్రతిష్టాత్మక బిల్లులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఎమ్మెల్యేలకు స్పీకర్‌ తమ్మినేని సూచన  

సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 15వ శాసనసభ రెండో సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం జీరో అవర్‌ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మొత్తం 14 రోజులపాటు 78 గంటల 35 నిమిషాలు సభ జరిగిందని ఆయన తెలిపారు. 121 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానాలు చెప్పారని, 57 నక్షత్ర గుర్తు ప్రశ్నలు, తొమ్మిది నక్షత్ర గుర్తులేని ప్రశ్నలు, ఐదు షార్ట్‌ నోటీసు ప్రశ్నలకు లిఖితపూర్వకంగా జవాబులిచ్చారని పేర్కొన్నారు. మంత్రులు రెండు స్టేట్‌మెంట్లు ఇచ్చారన్నారు. 20 బిల్లులను ప్రవేశపెట్టగా 19 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఒక బిల్లును ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 327 ప్రసంగాలు జరిగాయని, ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగిందని స్పీకర్‌ వివరించారు.

చరిత్రాత్మకం..
ఈ సమావేశాలను చరిత్రాత్మకమైనవిగా భావిస్తున్నట్లు స్పీకర్‌ చెప్పారు. శాసనసభ్యునిగా తనకున్న అనుభవంలో 20 బిల్లులను చర్చించి ఆమోదించడం చరిత్రగా ఆయన పేర్కొన్నారు. బిల్లులపై పూర్తి స్థాయి చర్చ జరిగిందని, బిల్లుల వాస్తవ స్ఫూర్తిని సభ్యులు అర్థం చేసుకున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సామాజిక న్యాయం కోసం చేసిన ఈ బిల్లులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ బిల్లులను ఆమోదించారో వాటి ఫలితాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని అన్ని పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ బిల్లుల అమలుకు అందరూ ప్రభావవంతంగా పనిచేయాలని కోరారు. బిల్లుల స్ఫూర్తిని ప్రజలకు వివరించాలని సూచించారు. శాసన వ్యవస్థ బలంగా ఉండేందుకు సహకరించిన సభా నాయకుడిని, ఈ ప్రభుత్వాన్ని స్పీకర్‌గా అభినందిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు