డిసెంబర్ 15లోగా అసెంబ్లీ భవన నిర్మాణం

4 Oct, 2016 02:01 IST|Sakshi
డిసెంబర్ 15లోగా అసెంబ్లీ భవన నిర్మాణం

- గడువును నిర్దేశించామన్న స్పీకర్ కోడెల
- శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే
 
 సాక్షి, అమరావతి: వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తిచేసేందుకు డిసెంబర్ 15ను గడువుగా నిర్దేశించినట్లు శాసనసభాపతి డా.కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈమేరకు నిర్మాణ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం శాసనమండలి చైర్మన్ డా.చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ ఎస్‌వీ సతీశ్‌రెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి యనమల రామకృష్ణుడు, శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ, డీజీపీ నండూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తదితరులతో కలసి నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవన నిర్మాణాలను పరిశీలించారు. శాసనసభ శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా హక్కుల సంఘానికి సిఫారసు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని నివారించేందుకు నూతన సమావేశమందిరంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 డిసెంబర్ ఆఖరు లేదా జనవరి మొదట్లో అసెంబ్లీ!
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా జీఎస్టీకి సంబంధించిన బిల్లులను ఆమోదించనుంది. అవసరమైతే ఒకటి, రెండు రోజులు అదనంగా సమావేశాలు నిర్వహించి శాసనసభ శీతాకాల సమావేశాలను మమ అనిపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు