రుణమాఫీపై అసెంబ్లీలో తీర్మానించాలి

18 Jun, 2014 00:19 IST|Sakshi
రుణమాఫీపై అసెంబ్లీలో తీర్మానించాలి

 గోకవరం : సంపూర్ణ రుణమాఫీ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని  వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం గోకవరం వచ్చిన ఆయనను కృష్ణునిపాలెం రైతులు కలుసుకున్నారు. బాకీ తీర్చమంటూ బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులను వారు ఎమ్మెల్యేకు చూపించారు. తాము ఈ బకాయిలు చెల్లించే స్థితిలో లేమని, తమను ఆదుకోవాలని వారు కోరారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ తాను సీఎం అయిన తరువాత తొలి సంతకం రైతు రుణమాఫీపైనే చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నమ్మబలికారన్నారు.
 
 ఆయన మాటలను విశ్వసించి ఆయనను ప్రజలు గెలిపిస్తే  రుణమాఫీపై కమిటీ వేస్తూ సంతకం చేశారన్నారు. దాంతో బ్యాంకు అధికారులు అన్ని రకాల వ్యవసాయ రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. ఇప్పటికైనా సీఎం తన హామీకి కట్టుబడి రుణమాఫీని అమలు చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో సంపూర్ణ రుణమాఫీకి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బకాయిలను తీర్చమని రైతులపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఖరీఫ్ సాగుకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలను అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడతామన్నారు.
 

మరిన్ని వార్తలు