కిక్కు దించే జ‘గన్‌’

29 Jul, 2019 10:31 IST|Sakshi

మద్య నియంత్రణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలతో అక్రమాలకు చెక్‌

వచ్చే నెల నుంచి జిల్లాలో 15 ప్రభుత్వ దుకాణాలు

దశలవారీగా మద్య నిషేధమే ప్రభుత్వ అజెండా

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో.. మద్యం రాకాసి వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్న దుస్థితిని మహిళలు వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ముందు ఏకరువు పెట్టారు. అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని, ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో చట్టాన్ని చేశారు. ఫలితంగా జిల్లాలో మద్యం అక్రమాలకు చెక్‌పడటంతో పాటు నియంత్రణకు మార్గం సుగమమైంది.

సాక్షి, చిత్తూరు అర్బన్‌: జిల్లాలో ఏటా రూ.1,500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం ఏమాత్రమూ లెక్కచేయడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా దశలవారీ మద్యపాన నిషేధం వైపు మొగ్గు చూపుతోంది. దీన్ని బలపరుస్తూ అసెంబ్లీలో మద్య నియంత్రణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ బిల్లును పాస్‌ చేసింది. పైగా జిల్లాలో 15 దుకాణాలను వచ్చేనెల నుంచి ప్రభుత్వమే నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారుల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. 

కొత్త చట్టం ఇలా...
కొత్తగా ఆమోదించిన చట్టం ప్రకారం మద్యం విక్రయాల నియంత్రణే ప్రధాన అంశం. జిల్లాలోని మద్యం దుకాణాలు సమయపాలన పాటించకపోవడం, ఎమ్మార్పీ ఉల్లంఘన లాంటి అంశాలపై కొత్త చట్టం తీవ్రంగా పరిగణించనుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక భద్రతకు భంగం కలిగిస్తున్నారు. వీటిపై ఇప్పటివరకు దుకాణ నిర్వాహకులకు జరిమానాలు విధించడంతో పాటు తాత్కాలికంగా లైసెన్సులు రద్దు చేసేవారు. అయితే కొత్త చట్టంలో లైసె న్సు తీసుకున్న నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు సైతం పెట్టనున్నారు. ఇక ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయించడం ద్వారా విక్రయ సమయాలను సైతం కుదించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న 12 గంటల సమయంలో నాలుగు గంటలు తగ్గించి 8 గంటలు మాత్రమే మద్యాన్ని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు.  సెప్టెంబరు నెలాఖరుకు ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ గడువు ముగుస్తుండటంతో అక్టోబర్‌ నుంచి కొత్త పాలసీని తీసుకురానున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ప్రతిపాదనలు పంపాం
గతంలో జిల్లాలో డిస్పోజ్‌కానటువంటి దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఆ వివరాలను ఇప్పటికే పంపిం చాం. ప్రతి సర్కిల్‌లోనూ ఓ ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
– నాగలక్ష్మి, డెప్యూటీ కమిషనర్, జిల్లా మద్య నియంత్రణ, ఆబ్కారీ శాఖ

మరిన్ని వార్తలు