కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రైతులకు సాయం

14 Feb, 2019 04:42 IST|Sakshi

కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.10 వేలు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

సాక్షి, అమరావతి: అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6 వేలతో కలిసి మొత్తం రూ.10 వేలు ఇవ్వనున్నారు. ఖరీఫ్‌లో మొదటి దశ, రబీలో రెండు దశలు మొత్తం మూడు దశల్లో ఈ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఎన్నికలు ముందు వరుసగా మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో బుధవారం మరోసారి నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 5 ఎకరాలలోపు ఉన్న 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.6 వేలను మూడు వాయిదాల్లో ఇవ్వనుందని, అది ఏమాత్రం చాలదని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అందుకే 54 లక్షల కుటుంబాలకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తాము రూ.4 వేలు కలిపి మొత్తం రూ.10 వేలు ఇస్తామని అన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లెక్కలోకి రాని 5 ఎకరాలకు పైగా భూములున్న రైతులు మరో 15 లక్షల మంది ఉంటారని, వారికి రాష్ట్రం నుంచే మొత్తం రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. 54 లక్షల మందికి కేంద్రం తొలివిడత ఇచ్చే రూ.2 వేలకు తాము రూ.3 వేలు కలిపి మొత్తం రూ.5 వేలు ఇస్తామన్నారు. కేంద్రమిచ్చేది తొలి విడత రూ.1,080 కోట్లుకాగా, తాము తొలి విడత (రూ.3 వేల చొప్పున) ఇచ్చేది రూ.1,620 కోట్లని వెల్లడించారు. కేంద్ర పథకం పరిధిలోకి రాని సుమారు 15 లక్షల మందికి రూ.10 వేలు రాష్ట్రం ఇస్తుంది కాబట్టి దానికి రూ.750 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. కౌలు రైతుల లెక్కలు తీసి ఖరీఫ్‌లో వారికి సుఖీభవ పథకం కింద డబ్బులిస్తామన్నారు. 

కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు... 
సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేయాలని నిర్ణయం. ఫిబ్రవరి నెలాఖరులో అన్నదాత సుఖీభవ చెక్కులు పంపిణీకి చేసేందుకు ఆమోదం. కేంద్రం ప్రకటించిన రైతు పథకం పరిధిలోకి రాని రైతులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం. రైతు రుణమాఫీ కింద మిగిలినపోయిన చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయం. 

డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు 
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చేందుకు ఆమోదం. సిమ్‌ కార్డుతోపాటు మూడేళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం. ఏపీ వ్యవసాయ మండలి ఏర్పాటుకు ఆమోదం. వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఈ మండలి ఏర్పాటు. 
- పంచాయతీల్లో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపుపై నిర్ణయం.
1998లో డీఎస్సీలో క్వాలిఫై అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించాలని నిర్ణయం.  
1983–96 మధ్యలో నియమితులైన స్పెషల్‌ టీచర్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, భాషా పండితులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయం. 
వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం–తిరుపతి ఆధ్వర్యంలో తొమ్మిది పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, తొమ్మిది ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు ఆమోదం.  
ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.1.23 కోట్లు, ఏపీ భవన్‌లో ఖర్చు రూ.1.60 కోట్లు) మొత్తం రూ.2.83 కోట్లకు ఆమోదం. 
తిత్లీ, పెథాయ్‌ తుపాన్లలో నష్టపోయిన రైతులకు మిగిలిన పెండింగ్‌ సొమ్మును వెంటనే ఇవ్వాలని నిర్ణయం. 
78 మంది ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల మంజూరుకు ఆమోదం. వీటితోపాటు 9 మంది సీనియర్‌ అసిస్టెంట్స్, 28 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు, 28 మంది శాంప్లింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించాలని నిర్ణయం.  

భూ కేటాయింపులు 
సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సీఈఎస్‌ఎస్‌) సంస్థకు అమరావతి కేపిటల్‌ సిటీ వెలుపల 10 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి చెందిన 17.17 ఎకరాల భూమి ఉచితంగా కేటాయింపు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మారుపల్లిలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి బదలాయింపు.
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు. ఇందుకోసం 153.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు.
వైకుంఠపురం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం. 

అన్నదాత సుఖీభవతో రైతులకు సాయం: మంత్రి సోమిరెడ్డి
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.10,000 సాయం చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం చెప్పారు. కేంద్రం ఒక్కో విడత ఇచ్చే రూ.2,000తో పాటు మరో రూ.3,000 కలిపి మొత్తం రూ.5,000 చొప్పున రెండుసార్లు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కేంద్రం ప్రకటించిన పథకం కింద రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు అర్హత సాధిస్తారని, వీరితోపాటు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారు 15 లక్షల వరకు ఉంటారని, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 చొప్పున సాయం చేస్తుందని మంత్రి ప్రకటించారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో మార్చి నెలలో రూ.4,000 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ.4,000 కోట్లు జమ చేస్తామని తెలిపారు.  

>
మరిన్ని వార్తలు