అష్టకష్టాలు

18 Oct, 2014 02:25 IST|Sakshi
అష్టకష్టాలు

రిమ్స్‌లో అందజేసే సడేరాం సర్టిఫికెట్ల కోసం వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు.  వికలాంగులకు రిమ్స్‌లో  పరీక్షలు నిర్వహించి వారికి ధృవీకరణ పత్రాలను అందజేసి  అర్హులైన వారికి  ప్రభుత్వ పథకాలు ఉపయోగపడేలా  ప్రతి సంవత్సరం సడేరాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డీఆర్‌డీఏ, రిమ్స్  ఆధ్వర్యంలో వైఎస్ హయాంలో  2007లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అప్పటి నుంచి కొన్ని వేల మంది వికలాంగులు అర్హత పత్రాలు పొంది పింఛన్‌కు అర్హులయ్యారు.  ప్రస్తుత  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనెల 4వ తేదీ నుంచి రిమ్స్‌లో సడేరాం కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. సర్టిఫికెట్ల అందజేయిస్తామని వందలాది వికలాంగులను డీఆర్‌డీఏ  అధికారులు బస్సులలో రప్పిస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం కుటుంబసభ్యులు, బంధువుల సహాయంతో వికలాంగులు రిమ్స్‌కు చేరుకుంటున్నారు. రిమ్స్‌కు చేరుకున్నప్పటి నుంచి వారి కష్టాలు మొదలవుతాయి.

ఓపీ టిక్కెట్ రాయించుకోగానే డీఆర్‌డీఏ వారు ఆన్‌లైన్‌లో వాటిని నమోదు చేస్తారు. ఉదయం 9 గంటలకు నమోదు కార్యక్రమం మొదలవుతుంది. ఆయా విభాగాలకు చెందిన డాక్టర్లు  ఉదయం 10 గంటల నుంచి వికలాంగులను పరిశీలిస్తారు. ఒక్కో వైద్యుడు 20మందిని చూడగానే పరీక్షలు చేయడాన్ని నిలిపేస్తారు. ఇదేమిటని వికలాంగులు ప్రశ్నిస్తే తాము 20 మందినే చూస్తామని, అంతకంటే  ఎక్కువగా చూడటం తమ వల్ల కాదని, ఈ విషయాన్ని డీఆర్‌డీఏ వారికి చెప్పామని తెలుపుతున్నారు.

తమ ప్రైవేట్ క్లినిక్ వద్ద రద్దీగా ఉందని ఫొన్ రావడమే ఆలస్యం హడావిడిగా వెళ్లిపోతారు. వికలాంగులకు పరీక్షలు చేస్తే తమకేమీ ఒరుగుతుందనే ఆలోచనలో కొంతమంది వైద్యులు ఉన్నట్లు ఆరోపణలు  ఉన్నాయి.    మరికొందరు రిమ్స్‌లోనే పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను దళారులుగా పెట్టుకుని సర్టిఫికెట్‌కు రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 మరోవైపు వచ్చిన రోజే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పే అధికారులు వారానికో పదిరోజులకో వచ్చి తీసుకోవాలని చెబుతుండటంతో వికలాంగులు ఉసూరుమంటున్నారు.   పులివెందుల మున్సిపాలిటీ పరిధి నుంచి రెండు బస్సులలో  దాదాపు 100 మందికి పైగా వికలాంగులు శుక్రవారం రిమ్స్‌కు వచ్చారు. చెప్పాపెట్టకుండా మానసిక వైద్య నిపుణులు సెలవు పెట్టడంతో  మూడు రోజుల తర్వాత రమ్మని మానసిక వికలాంగులకు చెబుతున్నారు.
 
 రేషన్‌కార్డు లేకపోతే అనర్హులే!
 రేషన్‌కార్డులో పేరు ఉంటేనే వికలాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని డీఆర్‌డీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు ఉంటే ఫలితం లేదని తెలుపుతున్నారు. పదేళ్ల క్రితం రేషన్ కార్డు ఇచ్చారని, పుట్టిన పిల్లల నుంచి పదేళ్ల వయస్సున్న పిల్లలకు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్టులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆధార్‌కార్డు తీసుకొచ్చినా సంబంధిత మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకుని రావాలని చెప్పడంతో  అర్హులైన  వికలాంగులు కూడా చేసేదేమీ లేక  వెనుదిరుగుతున్నారు.

మరిన్ని వార్తలు