క్రీడాపటంలో మెరిసిన విశాఖ

30 Dec, 2013 02:16 IST|Sakshi
క్రీడాపటంలో మెరిసిన విశాఖ

ప్రపంచ క్రీడాపటంలో విశాఖ మరోసారి మెరిసింది. వెస్టిండీస్‌తో భారత్ జట్టు వన్డే క్రికెట్‌లో తలపడితే, బాక్సింగ్‌లో స్థానిక క్రీడాకారిణులు అంతర్జాతీయ పతకాల్ని సొంతం చేసుకున్నారు. పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలకు జాతీయస్థాయిలో ఆడేందుకు పాఠశాలల విద్యార్థులు అర్హత సాధించారు.  విలువిద్యలో గిరిజన క్రీడాకారుడు జాతీయ రికార్డునే సొంతం చేసుకుని విశాఖకే వన్నె తెచ్చాడు. ఏయూ జట్లు సైతం ఆల్ ఇండియా పోటీలకు అర్హత సాధించి విశ్వకళాపరిషత్ ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. గ్రామీణ క్రీడాకారులను ఉద్దేశించి నిర్వహించే పైకా క్రీడల్లో విశాఖ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు చక్కగా రాణించి నేషనల్స్ మీట్‌ల్లోనూ ఆడేందుకు సమాయత్తమౌతున్నారు. క్రీడాభివృద్ధి సంస్థకు చెందిన ప్రొఫెషనల్ ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించారు.
 
ఆల్ ఇండియాలో ఏ పోటీ అయినా సై...
 
 2013లో ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన మూడు జట్లు ఆల్ ఇండియా అంతర వర్శిటీ పోటీలకు అర్హత సాధించాయి.  బ్యాడ్మింటన్‌లో ఆల్ ఇండియా వర్శిటీ పోటీల్లోనూ లీగ్ దశలో సత్తాచాటి నాకవుట్ పోటీల్లో ప్రవేశించింది. పురుషుల విభాగంలో సౌత్‌జోన్ అంతరవర్శిటీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.  టెన్నిస్ పోటీల్లో మరో మారు ఏయూ జట్టు సత్తా నిరూపించుకుంది.  దక్షిణ మండల వర్శిటీ పోటీల్లో ఏయూ మెన్ టెన్నిస్ జట్టు నాలుగో స్థానంలో నిలిచి ఆల్ ఇండియా అంతర వర్శిటీ పోటీలకు అర్హత సాధించింది.  ఈ పోటీలు త్వరలో కోల్‌కతాలో జరగనున్నాయి.  మహిళా క్రికెట్ జట్టు దక్షిణ మండల వర్శిటీ పోటీల్లో సత్తా చాటి విజేతగా నిలిచింది. ఆల్ ఇండియా వర్శిటీ పోటీల్లోనూ ఆడనుంది.
 
 మెరిసిన గ్రామీణ క్రీడా మాణిక్యాలు
 
 ఈసారి రాష్ట్రంలోనే విశాఖ గ్రామీణ నుంచి అత్యధిక గ్రామీణ చిన్నారులు క్రీడా పాఠశాలలో ఆటలతోపాటు చదువుకునే అవకాశాన్ని పొందారు. హైదరాబాద్ హాకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో వీరంతా ఆటలతో పాటు చదువును అభ్యసించనున్నారు. క్రీడలే ప్రధానంగా సాగే క్రీడాపాఠశాలలో నుంచి మరో ఐదేళ్లలో వీరంతా జాతీయ స్థాయికి చేరుకునే అవకాశాల్ని అందిపుచ్చుకోనున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీరంతా రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు.
 
 పైకాలో...హవా
 
 గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు నిర్వహించే క్రీడల్లోనూ జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు.  ఖోఖోలో ముగ్గురు జాతీయ మీట్‌కు అర్హత సాధించగా టెన్నిస్‌లో ఇద్దరు, హ్యాండ్‌బాల్‌లో మరో ఇద్దరు ఎంపికయ్యారు. కాగా వీరంతా త్వరలోనే నేషనల్ మీట్‌లో పాల్గోనుండగా ఇప్పటికే కబడ్డీ పైకా నేషనల్స్‌లో ఇద్దరు కర్నాటకలోని హవేలీలో ఆడి చక్కటి ప్రతిభ కనబరిచారు. పైకా బాక్సింగ్ క్రీడల్లో ఏడుగురు క్రీడాకారులు స్వర్ణాలందుకోవడం విశేషం.
 
 పాఠశాలల క్రీడా సమాఖ్యకు ఖ్యాతి


 ఎస్‌జీఎఫ్‌ఐలో ఆడేందుకు పాఠశాలల చిన్నారులు అర్హత సాధించారు.  అస్సాంలోని గౌహతిలో జరిగిన ఎస్‌జీఎఫ్ నేషనల్ బాక్సింగ్ మీట్‌లో మేఘన రజత పతకాన్ని సాధించగా మనీషా కాంస్యాన్నందుకుని విశాఖ ఖ్యాతిని ఇనుమడించారు.  లలెంకవలీ ఏకంగా స్వర్ణాన్నే కై వసం చేసుకుంది. స్టేట్‌మీట్‌లో ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను అందుకుంది.  
 
 సాయ్ ఎస్టీసీ మెరికలు...పంచ్ విసిరితే పతకాలే


 భారత క్రీడాసంస్థ శిక్షణ కేంద్రంలో నాలుగు శిక్షణ శిబిరాలు ఈ ఏడాది నిర్వహించారు. అందుకు తగినట్టుగానే బాక్సింగ్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పంచ్‌లు విసిరి పతకాల్ని పట్టుకొచ్చారు. బల్గేరియాలో జరిగిన యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ కాంస్యపతకాన్ని సాధించింది. నిఖత్ గోల్డెన్ గ్లోవ్ చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యపతకాన్ని అందుకుంది.  సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో భారతమ్మ, శశికళలు చెరో కాంస్యాన్ని అందుకున్నారు. అజర్‌బైజాన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ శ్యాం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.  విజయ్‌కుమార్ కజికిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.  ఇదిలా వుండగా ఎస్టీసీలో శిక్షణ పొందిన వాలీబాల్ ఆటగాడు వెంకటనాని ఆసియన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించాడు.  
 
 విలుకాని జాతీయ రికార్డు...


 గిరిజన విలువిద్య క్రీడాకారుడు బైరాగినాయుడు దశాబ్దం క్రితం నమోదైన రికార్డును తిరగ రాశాడు. తొలి రెండేళ్లలో కనీసం పతకం సాధించలేక పోయిన గిరిజన క్రీడాకారుడు ఏకంగా రికార్డునే సొంతం చేసుకోవడంతో క్రీడాలోకం హర్షం ప్రకటించింది.  ఇండియన్ రౌండ్‌లో ఆర్చరీ ఆటగాళ్లు పతకాలు సాధిస్తున్నా రికర్వ్‌లో ఇంకా చక్కటి ప్రోత్సాహం లభించకున్నా బైరాగినాయిడు సత్తా చాటాడు.  సీనియర్ నేషనల్స్‌లో ఒలింపిక్ రౌండ్‌లో టాప్ 20 ర్యాంక్‌కు చేరుకున్నాడు.  
 
 క్రికెట్‌కు స్వర్ణయుగం


 అంతర్జాతీయ క్రీడా పటంలో విశాఖ ఖ్యాతికి 2013ది ప్రత్యేకం. ఏకంగా నాలుగు దేశాల జూనియర్స్ టోర్నీకి వేదికగా నిలిచింది. తొలిసారిగా సౌతాఫ్రికా జూనియర్స్ జట్టు విశాఖలో సిరీస్ ఆడింది. ఈసారి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు భారత్ సత్తా చాటింది.  మరో మారు క్వాడ్రేంగులర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఇదిలా ఉంటే టెస్ట్ హోదా సాధించేందుకు అన్ని హంగుల్ని ఈ ఏడాది పూర్తి చేసుకుంది. ఇక్కడ జరిగిన వన్డే సిరీస్‌లో ఐసీసీ ప్రతినిదులు సైతం స్టేడియంలోని వసతుల్ని పరిశీలించారు. ఇక టెస్ట్ క్రికెట్ లాంఛనమే. అయితే ఆహ్వాన జట్టు భారత్‌కు తొలిసారిగా వైఎస్‌ఆర్ స్టేడియంలో పరాజయం ఎదురైంది.  అప్రతిహతంగా సాగే భారత్ విజయ పరంపరకు వెస్టిండీస్ జట్టు గండికొట్టింది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న భారత్‌కు ఆశనిపాతమే అయింది.
 

మరిన్ని వార్తలు