పేదరికంలో మెరిసిన ఆణిముత్యం

23 Feb, 2014 03:05 IST|Sakshi

తాడిమర్రి, న్యూస్‌లైన్ : కృషి, పట్టుదల ఉంటే చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు బోనాల ప్రభాకర్. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెరువుకు చెందిన ప్రభాకర్ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరీక్ష ఫలితాల్లో 97 మార్కులతో రాష్ర ్టస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. బోనాల లక్ష్మయ్య, నారాయణమ్మ దంపతులకు రాము, ప్రభాకర్ సంతానం. లక్ష్మయ్య 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి సెంటు స్థలం లేదు. పూరిగుడిసెలోనే నివసించారు.

 నారాయణమ్మ కూలి పనులు చేస్తూ కుమారులిద్దరినీ చదివించింది. ప్రభాకర్ పదో తరగతి వరకు తాడిమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ (బీఎస్సీ) ధర్మవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివాడు. ఆ తర్వాత కూలిపనులకె ళుతూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూనే గ్రూప్-2, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు.
 
 గత ఏడాది జరిగిన వీఆర్వో ఫలితాల్లో 87 మార్కులతో 68వ ర్యాంక్ సాధించాడు. అయితే 67వ ర్యాంక్‌కే కటాఫ్ నిలిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టు సాధించాలని పట్టుదలతో చదివాడు. ఫలితంగా వీఆర్‌ఏ ఫలితాల్లో (హాల్ టికెట్టు నంబర్ 312100031) 97 మార్కులు సాధించి స్టేట్ ఫస్టుగా నిలిచాడు. వీఆర్‌ఓ పరీక్షల్లో 87 మార్కులతో 286 ర్యాంక్ సాధించాడు. ప్రభాకర్ వీఆర్‌ఏ ఫలితాల్లో స్టేట్‌ఫస్టుగా నిలవడంతో తల్లి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. గ్రామస్తులు తల్లీ, కుమారులకు స్వీట్లు తినిపించి అభినందించారు.
 
 అమ్మ కల సాకారం చేయాలనుకున్నా..
 ఇరవై ఏళ్ల క్రితం నాన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అమ్మ ఎలాగైనా అన్న(ప్రస్తుతం ప్రైవేట్ టీచర్)ను, నన్ను చదివించాలని ఎంతో కష్టపడింది. అమ్మ ఒక్క రోజు ఇంటి దగ్గర ఉంటే ఇల్లు గడిచేది కాదు. అమ్మ తపన నాలో పట్టుదలను పెంచింది. ఎలాగైనా కష్టపడి చదివి ఉద్యోగం సాధించి అమ్మ కల సాకారం చేయాలను కున్నాను. కల నెరవేరింది.                
 - బోనాల ప్రభాకర్, వీఆర్‌ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్
 

మరిన్ని వార్తలు