స్వర్ణ చతుర్భుజి ఎంత బాగుందో..

17 Aug, 2018 13:09 IST|Sakshi
సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ సీ2 ప్రయోగం విజయవంతం అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి(ఫైల్‌)

జిల్లాలో ఐదు పర్యాయాలు వాజ్‌పేయి పర్యటన

భారతరత్న ప్రసంగం వినేందుకు రాజకీయాలకతీతంగా హాజరు

జ్ఞాపకం :తన కలల రహదారి ‘స్వర్ణ చతుర్భుజి’పై ప్రయాణించడం మంచి అనుభూతిని మిగిల్చిందని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ‘ఈ రోడ్డు ఎంత బాగుందో’ అని మురిసిపోయారు. ప్రధాని హోదాలో 2004 సంవత్సరంలో ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నెల్లూరు వంటకాలను వాజ్‌పేయి రుచి చూశారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం ఆయన హెలికాప్టర్‌లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. కానీ సభ ముగిసే సరికి చీకటి పడింది. హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణించేందుకు భద్రతా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన రహదారి మీదుగా చెన్నైకు బయలుదేరారు. హెలికాప్టర్‌లో కాకుండా రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుందని వాజ్‌పేయికి వెంకయ్యనాయుడుతోపాటు అధికారులు చెప్పినపుడు ఆయన ఎంతో çసంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కలకల రహదారైన స్వర్ణ చతుర్భుజి మీదుగా ప్రయాణించడం తనకు మంచి అనుభూతిని కలిగించిందని చెన్నైకి వెళ్లిన తరువాత అటల్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వాజ్‌పేయి చేపట్టి పూర్తి చేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్‌కతా వరకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి(నాలుగు లేన్లు) నిర్మించారు. అందులో భాగంగా జిల్లాలో 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. గురువారం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. జిల్లాతో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఐదుసార్లు జిల్లాకు వచ్చి వెళ్లారు. ఆయన జ్ఞాపకాలను జిల్లావాసులు గుర్తుచేసుకుంటున్నారు.

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శం అని, ఆయన మృతి దేశానికి తీరని లోటని జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజాపతినిధులు పార్టీలకు అతీతంగా పేర్కొన్నారు. వాజ్‌పేయికి నెల్లూరు జిల్లాతో ఉన్న     అనుబంధంపై ప్రత్యేక కథనం

నెల్లూరు(బారకాసు):జనసంఘ్‌ పార్టీని స్థాపించిన తరువాత పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రక్రియలో భాగంగా 1977లో ఆయన నెల్లూరుకు వచ్చారు. అప్పుడు పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసంఘ్‌ తరపున అన్నదాత మాధవ రావు విజయం సాధించి పార్టీకి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆ తరువాత జనతా పార్టీలో జనసంఘ్‌ విలీనమైన తరువాత అందులో నుంచి బయటకు వచ్చేసి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటైన మొదటి సంవత్సరంలో నగరంలోని పురమందిరం(టౌన్‌హాల్‌)లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. 1983లో ఆయన ఉదయగిరిలో ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు మద§ద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్‌ తరపున ఇందిరాగాంధీ కూడా జిల్లాకు వచ్చారు. 

అప్పట్లో ఆయన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడినా.. కొద్దిపాటి భాషా పరిజ్ఞానం ఉన్నవారికి కూడా సులభంగా అర్థమయ్యేది. ప్రసంగంలో ఆయన ఉపయోగించే కవితలు, చమత్కారాలు ఎంతగానో ఆకట్టుకునేవి. అంతేగాక విమర్శలు చేసేటప్పుడు కూడా ఎంతో సంస్కారవంతమైన పదాలను ఉపయోగించి తన హుందాతనాన్ని నిలుపుకునే వారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వూరు రాధాకృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. అందులో పాల్గొన్న వాజ్‌పేయి కాంగ్రెస్, టీడీపీపై చేసిన విమర్శలను కూడా ప్రజలను ఆసక్తిగా వినడం గమనార్హం. వీఆర్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా వాజ్‌పేయి పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చే వాజ్‌ పేయి సభలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరయ్యేవారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఆయన సభలకు హాజరై ఆయన  ప్రసంగాలు విని ఆనందించేవారు.

2004లో భారత ప్రధానిగా ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. అప్పట్లో ఏసీ సుబ్బారెడ్ది స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పా ల్గొన్నారు. ఆ రోజున వాజ్‌ పేయికి మోకాలు నొప్పి అధికం కావడంతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అతిథి గృహానికి పిలిపించుకుని వారితో ముచ్చటించారు. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌ను రాజకీయాలలోకి రావాలని కూడా ఆయన ఆహ్వనించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన షార్‌ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. 2003లో షార్‌ కేంద్రానికి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్‌ ధావన్‌ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరును ప్రధానిగా వాజ్‌పేయి  పెట్టారు. షార్‌ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఢిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో ఆవిష్కరించారు. షార్‌ కేంద్రాన్ని చూస్తే తనలో నూతనోత్సాహం వస్తుందని పలుమార్లు ఆయన శాస్త్రవేత్తలకు తన మనసులోని మాటను తెలిపారు.

సతీష్‌ దవన్‌ స్పేస్‌ సెంటర్‌ నామకరణం చేసింది వాజ్‌పేయి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్‌ ధవన్‌స్పేస్‌సెంటర్‌ (షార్‌) కేంద్రంతో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయన 1999 నుంచి 2004 దాకా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999 మే 26న షార్‌లో నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ సీ2 ప్రయోగానికి విచ్చేశారు. ఆ ప్రయోగంలో సముద్రాల మీద ఆధ్యయనం చేసేందుకు ఐఆర్‌ఎస్‌–పీ4 (ఓషన్‌శాట్‌)తో పాటు కిట్‌శాట్‌–3, ఉత్తరకొరియాకు చెందిన డీఎల్‌ఆర్‌ మైక్రోశాటిలైట్స్, జర్మనీ టబ్‌శాట్‌ అనే ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించారు. ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు వాజ్‌పాయి ప్రధాని హోదాలో విచ్చేశారు. అప్పటిదాకా అందరు ప్రధానులు మిషన కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రయోగాన్ని తిలకించేవారు. అలాంటింది ప్రయోగాన్ని దగ్గరగా తిలకించాలని కోరడంతో ఆయన కోసం ప్రయోగవేదికకు సుమారు ఐదు కిలోమీటర్లు దూరంలో ఒక కూడలిలో అప్పట్లో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా ఒక షెడ్డు వేశారు. దీనికి త్రీడీ గ్లాసులు కూడా ఏర్పాటు చేశారు. ఆ త్రీడీ గ్లాసుల్లో నుంచి ప్రయోగాన్ని మొదటి దశలో మండే దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. ప్రయోగాన్ని తిలకించిన తరువాత మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు విచ్చేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత 2004లో షార్‌ కేంద్రానికి సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌గా పేరు మార్పుచేసినపుడు వాజ్‌పేయి చేతులు మీదుగా ఢిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆవిష్కరించారు. ఆయన షార్‌కు విచ్చేసినపుడు అప్పటి ఇస్రో చైర్మన్‌ కస్తూరిరంగన్, అప్పటికి షార్‌ డైరెక్టర్‌ వసంత్‌ ఘనంగా స్వాగతం పలికారు.

వాజ్‌పేయి మరణం తీరనిలోటు
నెల్లూరు(బారకాసు):మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం బీజేపీ శ్రేణులకు తీరని బాధ కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్‌ తెలిపారు. ఆయన మరణానికి తాము సంతాపాన్ని ప్రకటిస్తున్నామన్నారు. రోడ్లు, నదులు అనుసంధానం, ప్రోక్రాన్‌ అణుపరీక్షలతో దేశాన్ని అభివృద్ధి పథంలో వాజ్‌పేయి తీసుకెళ్లారన్నారు. ఆయనకు నెల్లూరుజిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే ఆవేదన కలుగుతుందన్నారు.

వాజ్‌పేయి మృతికి మేకపాటి సంతాపం
నెల్లూరు(సెంట్రల్‌): మాజీ ప్రధాని, భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి  మృతిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబం లో జన్మించి, అత్యున్నత శిఖరాలను చేరిన ఆయన జీవితం దేశానికే గర్వకారణం అని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలను కలు పుతూ రహదారులను నిర్మించిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రధానిగా ఉండి కూడా ఏ మాత్రం ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రధానంగా కార్గిల్‌ యుద్ధంలోనూ , ప్రోక్రాన్‌–2 అణుపరీక్షల నిర్వహణలోనూ ఆయన స్థిర చిత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 1999లో ఆయన ప్రభుత్వం ఒకే ఒక ఓటుతో  విశ్వాసం కోల్పోయిన ఘటన ఆయనకు  ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణం తెలిపారు.  పదవిని తృణపాయంగా విడిచిపెట్టి భావి తరాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేశారని రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

చిరంజీవి యువతకు అభినందనలు
నెల్లూరు(బృందావనం):గుజరాత్‌లో 2001సంవత్సరం జనవరిలో జరిగిన భూకంపం కారణంగా బాధితులైన వారిని ఆదుకున్న అఖిలభారత చిరంజీవి యువతను అప్పటి భారత ప్ర«ధాని అటల్‌బిహారీవాజ్‌పేయి అభినందించారని యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరుకు చెందిన చిరంజీవి అభిమాని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో భూకంప బాధితులను అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్‌.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన చిరంజీవి యువత నాయకులు సురేష్‌(కర్నూలు), బషీర్‌(ఒంగోలు), ఆనందరాజు(హైదరాబాద్‌), రవీంద్రబాబు(గుంటూరు) తదితరులతో  కలసి రెండునెలలకు పైగా కచ్‌ప్రాంతంలో విశేష సేవలందించామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తామంతా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయిని ఆయన కార్యాలయంలో కలసి తమ సేవలను వివరించామన్నారు. అలాగే తాము అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో సేకరించిన రూ.3లక్షల చెక్కును అందజేశామని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు.  ఆయన తాముచేసిన సేవలను గుర్తించి ఎంతో ప్రశంసించారని, అలాగే అభిమానులుగా స్వయంగా వచ్చి సేవలందించడంపట్ల,  నటుడిగా ఉన్న చిరంజీవికి అభినందనలు తెలిపారన్నారు.

మరిన్ని వార్తలు