‘దేశ రక్షణ రంగంలో నేవీ కీలక పాత్ర’

5 Sep, 2019 12:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : మన దేశంలో తయారైన రక్షణ పరికరాలను ఇతర దేశాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నావికాదళ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. నగరంలో జరిగిన నావికాదళ వార్షిక నాణ్యతా సదస్సులో అతుల్‌ కుమార్‌ జైన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేస్తున్నామని అన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తూనే నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రక్షణ రంగంలో నాణ్యతా ప్రమాణాలకు డీజీక్యూఏ(డైరెక్టరేట్‌ జనరల్‌ క్వాలిటీ అస్సురెన్స్‌) విభాగం అత్యంత కీలకమని, దేశ రక్షణలో నేవీ ప్రధాన పాత్ర పోషించడంలో ఈ విభాగం ముఖ్య పాత్ర నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లలో నావికాదళం దేశ రక్షణలో అత్యంత కీలకంగా ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సంజయ్‌ చౌహాన్‌, ఏడీజీ అతుల్‌ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు